నాలుగు మాటలు.. ఆరు హత్యలు

4 Mar, 2021 02:44 IST|Sakshi

ఒంటరి మహిళలే లక్ష్యం

మాయమాటలు చెప్పి స్నేహం

మద్యం తాగించి హత్య.. ఆపై బంగారం అపహరణ

ఇప్పటివరకు ఐదు హత్యలు

తాజాగా మరో మహిళను చంపిన కిల్లర్‌

వికారాబాద్‌ జిల్లాలో ఘటనలు

వికారాబాద్‌: ఒంటరి మహిళలతో స్నేహం చేయడం.. మద్యం తాగించి, మాయమాటలు చెప్పడం.. పథకం ప్రకారం హత్య చేయడం.. ఆపై బంగారం, డబ్బు దోచుకోవడం.. ఇదీ ఓ కిరాతకుడి బాగోతం.. ఇలా ఇప్పటికి ఆరు హత్యలు చేశాడు. గతంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదిస్తున్న పోలీసులకు కిల్లర్‌ పట్టుబడ్డాడు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్పపై పలు కేసులు నమోదయ్యాయి. ధారూర్‌ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ (38) కూలీ పనులు చేసేందుకు వికారాబాద్‌లోని అడ్డాకు వచ్చింది.

చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో భర్త చంద్రయ్య వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సిరిగేట్‌పల్లి రైల్వే గేటు సమీపంలో పొలం పక్కన మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరున్నారు. ఆ మృతదేహం అమృతమ్మదేనని గుర్తించారు. మృతురాలి శరీరంపై నగలు లేకపోవడాన్ని గమనించిన పోలీసులు ఎవరో బంగారం, నగదు కోసమే హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాలతో ఆరా..
దర్యాప్తులో భాగంగా వికారాబాద్‌లోని కూలీల అడ్డా వద్దకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో కేసును ఛేదించే యత్నం చేశారు. ఆ రోజు ఉదయం అడ్డా నుంచి ఆటోలో అమృతమ్మ ఆలంపల్లి వైపు వెళ్లినట్లు గమనించారు. దీంతో పాటు ఓ బంగారం తాకట్టు దుకాణంలో బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయగా ఆధార్‌ కార్డు లేకపోవడంతో పెట్టుకోలేదు.
హత్య ఇలా చేశాడు..
అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్ప అమృతమ్మకు ఉదయం కల్లు తాగించాడు. అనంతరం ఆటోలో కొత్తగడి వైపు వెళ్లి సిరిగేట్‌పల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఆటో దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. ఈమె మద్యం మత్తులో ఉండగా, హత్య చేసి పారిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని పారిపోయాడు.
1985 నుంచి నేర చరితుడే..
50 ఏళ్ల కిష్టప్ప ధారూరు పరిధిలో 1985లో మొదటి హత్య చేయగా, 2008లో వికారాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఓ హత్య చేశాడు. 2008లో తాండూరులో హత్య చేసి బంగారం దోచుకున్నాడు. 2010లో యాలాల పీఎస్‌ పరిధిలో సెల్‌ఫోన్, డబ్బుల కోసం హత్య చేశాడు. 2016లో వికారాబాద్‌లో హత్య చేసి డబ్బు, సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు పాల్గొనగా, మిగతావన్నీ తాను ఒక్కడు చేసినవే. మహిళలను హత్య చేయడంతో పాటు రెండు కేసుల్లో మహిళలను గుర్తు పట్టకుండా కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు.

మరిన్ని వార్తలు