మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ​​​​​​​ 

6 Nov, 2021 07:32 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌ .. ఇన్‌సెట్‌లో నిందితుడు మహ్మద్‌ ఖదీర్‌

నిర్ణీత సమయానికి నిషా ఎక్కాల్సిందే 

లేదంటే సైకోగా మారిపోతున్న ఖదీర్‌ 

డబ్బు కోసం హత్యలు చేస్తున్న వైనం 

మత్తులోనూ కిరాతకంగా వ్యవహారాలు 

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి సమయానికి అది దొరక్కపోతే ఉన్మాదిగా మారుతున్నాడు. దానికి అవసరమైన డబ్బు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని చోరీలకు యత్నిస్తాడు. వారి నుంచి ప్రతిస్పందన ఎదురైతే దారుణంగా చంపేస్తాడు. మద్యం మత్తులోనూ మర్డర్లు చేస్తుంటాడు. ఇలా ఇప్పటి వరకు నాలుగు హత్యలు చేసిన ఉన్మాది మహ్మద్‌ ఖదీర్‌ను హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం తెలిపారు. సంయుక్త సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఏసీపీ ఆర్‌జీ శివమారుతీలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. 

తండ్రి ప్రవర్తనతో ఉన్మాదిగా... 
కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బాగ్దల్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖదీర్‌ నిరక్షరాస్యుడు. ఇతడికి చిన్నతనం నుంచే తండ్రి వేధింపులు ఎదురయ్యాయి. అకారణంగా దూషించడం, కొట్టడం వంటివి చేస్తుండటంతో మానసికంగా దెబ్బతిన్నాడు. తన 15వ ఏట ఇంటి నుంచి వచ్చేసి హైదరాబాద్‌ చేరాడు. బోరబండలోని సఫ్దర్‌నగర్‌లో నివసిస్తున్న ఇతడికి భార్య, ఐదుగురు సంతానం ఉన్నారు. మద్యానికి బానిసగా మారడంతో పాటు ఉన్మాదిగా ప్రవర్తిస్తుండటంతో భార్య కూడా ఇతడికి దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రం కుటుంబం వద్దకు వెళ్తున్న ఖదీర్‌ వారికి డబ్బు ఇస్తుంటాడు. ఫుట్‌పాత్‌లపై బతికే ఇతడు కూలీపనులు చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు ఆటోడ్రైవర్‌గానూ మారతాడు. 

చదవండి: (ట్రయల్‌ రూమ్‌లో యువతిని వీడియో తీసిన యువకులు)

టైమ్‌కు ‘మందు’ పడాల్సిందే... 
ప్రతి రోజూ చీప్‌ లిక్కర్‌ నిషాలో జోగుతూ ఉండే ఇతగాడు దానికి బానిసగా మారాడు. నిర్ణీత సమయానికి మద్యం తాగకపోతే ఉన్మాదిగా మారిపోతుంటాడు. చీప్‌ లిక్కర్‌ ఖరీదు చేసుకోవడానికి అవసరమైన డబ్బు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రించే యాచకులను అడుగుతాడు. ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే వారు నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై మోది చంపేస్తాడు. నిద్రిస్తున్న వారి నుంచి దోచుకోవడానికి ప్రయత్నించే ఇతగాడు వాళ్లు అడ్డుకున్నా ఇదే పని చేస్తాడు. 2017లో రెండు ఆటోలు చోరీ చేసిన కేసుల్లో హబీబ్‌నగర్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి ఆరు నెలల శిక్ష అనుభవించాడు. 

17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... 
ఇతగాడు 2019 డిసెంబర్‌ 30న నాంపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ముబారక్‌ అలీ అనే వ్యక్తిని చంపాడు. ఈ కేసులో 2020 జనవరి 2న అరెస్టు అయ్యాడు. 2021 ఏప్రిల్‌ 4 వరకు జైల్లోనే ఉన్నాడు. ఇతడికి బెయిల్‌ ఇవ్వడానికి ఎవరూ రాకపోవడం, ఏడాదిన్నర పాటు జైల్లోనే ఉండటంతో న్యాయస్థానమే మాండేటరీ బెయిల్‌ ఇచ్చింది. గత నెల 15న హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని చంపాడు. గత నెల 31న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని అగ్గిపెట్టె కావాలంటూ లేపాడు. ఆపై డబ్బు డిమాండ్‌ చేయడంతో అతడు తిరస్కరించాడు. దీంతో బండరాయితో మోది అతడిని చంపిన ఖదీర్‌ జేబులో ఉన్న రూ.150, మద్యం సీసా తస్కరించాడు. ఆ మద్యం తాగి నాంపల్లి గూడ్స్‌ షెడ్‌ వద్దకు వచ్చాడు. అక్కడ ఆటోట్రాలీలో నిద్రిస్తున్న ఖాజాను లేపి కాస్త చోటు ఇమ్మన్నాడు. అతడు కాదనడటంతో సమీపంలో ఉన్న బండరాయితో కొట్టి చంపేశాడు.  

పీడీ యాక్ట్‌ ప్రయోగానికి నిర్ణయం... 
ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర సమాచారం ఆధారంగా ఖదీర్‌ను పట్టుకున్నారు. ఈసారి ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని నిర్ణయించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అలా ఇలా జైల్లో ఉండగానే కేసుల విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ ఉన్మాది బాహ్యప్రపంచంలో ఉంటే మరికొన్ని ఇలాంటి హత్యలు చేసే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు