Kidnap Case: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..

18 Jan, 2022 07:37 IST|Sakshi
కిడ్నాప్‌ కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్, ఎస్‌ఐ శివకృష్ణ

మండపేట(తూర్పుగోదావరి): నమ్మిన పాలేరే నయవంచన చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, చేసిన అప్పులు తీర్చేందుకు మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం యజమానిని కిడ్నాప్‌ చేయించాడు. వచ్చిన రూ.10 లక్షలు పంచుకుని అంతా సద్దుమణిగిపోయిందని అందరూ ఆనందపడ్డారు. కానీ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు.

చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్‌ బంగార్రాజు..

ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై ఎటువంటి ఫిర్యాదూ రానప్పటికీ స్పందించారు. తమంత తామే ఫిర్యాదు తీసుకుని మరీ విచారణ చేపట్టారు. చివరకు కారు నంబరు ఆధారంగా కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించారు. అయిదుగురు నిందితులకు అరదండాలు వేశారు. వీరిలో ఒకరు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ కూడా ఉండటం గమనార్హం. మండపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ కేసు వివరాలను సోమవారం విలేకర్లకు వివరించారు. ఆయన కథనం ప్రకారం..

అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ద్వారంపూడి కృష్ణారెడ్డి ఈ నెల 5వ తేదీ ఉదయం మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దకు వెళ్లారు. ఆయనను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఈ ఉదంతంపై సోషల్‌ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం జరిగింది. కిడ్నాపర్ల డిమాండ్‌ మేరకు బంధువులు రూ.10 లక్షలు చెల్లించి, కృష్ణారెడ్డిని విడిపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు దీనిపై విచారణ జరపాల్సిందిగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ఎస్సై బి.శివకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రూరల్‌ సీఐ పి.శివగణేష్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి బంధువులను అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కృష్ణారెడ్డిని కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆయనను కారులో ఎక్కించుకుని రాజానగరం మండలం తుంగపాడు, గోకవరం, రంపచోడవరం మీదుగా సీతపల్లి వరకూ తీసుకువెళ్లారు. ఆయనను వదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను డిమాండ్‌ చేశారు. ఆ మొత్తాన్ని పాలేరు బక్కి జయరాజు ద్వారా తమకు అందజేయాలని సూచించారు.

దీంతో కుటుంబ సభ్యులు జయరాజుకు రూ.10 లక్షల నగదు ఇచ్చి పంపగా.. కడియం మండలం బుర్రిలంక వద్ద హైవేపై నగదు తీసుకుని, కృష్ణారెడ్డిని అప్పగించి పరారయ్యారు. ‘జయరాజుకు ఇచ్చి పంపాలి’ అని చెప్పడంతో పోలీసులు తొలుత జయరాజును అనుమానించారు. అతడి కాల్‌ డేటా సేకరించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించి, కేసును ఛేదించారు.

రాజానగరం మండలం ముక్కినాడపాకలుకు చెందిన జయరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు పాకా శ్రీను, పాకా సతీష్‌కుమార్, మండేల ప్రవీణ్, వారి స్నేహితుడు ద్వారంపూడి శ్రీనివాసరెడ్డితో కలిసి కృష్ణారెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు పథక రచన చేశాడు. వీరిలో సతీష్‌కుమార్‌ ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నిందితులు వచ్చిన సొమ్మును పంచుకుని సోమవారం వేములపల్లిలో పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివకృష్ణలను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. 

మరిన్ని వార్తలు