డాక్టర్‌ హత్య కేసు: అత్యాశే ఉరి తాడైంది

5 Aug, 2021 07:29 IST|Sakshi
ఉరిశిక్ష పడిన వారు

డాక్టర్‌ సుబ్బయ్య హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష

మహిళ సహా ఇద్దరికి యావజ్జీవం

చెన్నై సెషన్‌ కోర్టు తీర్పు

సాక్షి ప్రతినిధి, చెన్నై: బంధువును హతమార్చి, అక్రమంగానైనా ఆస్తిని కాజేయాలన్న పేరాశ ఆ కుటుంబాన్ని ఉరికంబానికి చేరువచేసింది. భర్త, ఇద్దరు కుమారులకు ఉరిశిక్ష, భార్యకు యావజ్జీవశిక్ష పడేలా చేసింది. మరో నలుగురికి కూడా ఉరి శిక్ష విధించింది. నరాల వైద్యనిపుణుడు సుబ్బ య్య హత్యకేసులో చెన్నై సెషన్స్‌ కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్‌ సుబ్బయ్య పదవీ విరమణ పొంది చెన్నై రాజా అన్నామలైపురంలో సొంత క్లినిక్‌ నడిపేవాడు. ఇతను 2013 సెప్టెంబర్‌ 9న దాడికి గురై అదే నెల 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.

బంధువులే రాబందులు.. 
డాక్టర్‌ సుబ్బయ్య మేనమామ పెరుమాళ్‌ నాడార్‌కు మూగ, చెవుడు. సంతానం లేరు. మొదటి భార్య మరణించడంంతో అన్నపళం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దికాలంలోనే అన్నపళం భర్తను విడిచి వెళ్లిపోయింది. మూడేళ్ల తరువాత పసికందుతో మళ్లీ భర్త వద్దకు వచ్చి ఆస్తిలో వాటా కోరింది. ఇందుకు నిరాకరించిన పెరుమాళ్‌ తన ఆస్తినంతటినీ సోదరి అన్నకిళి (హతుడు సుబ్బయ్య తల్లి) పేరున రాసాడు. ఆస్తి కోసం పెరుమాళ్‌ రెండో భార్య అన్నపళం, సోదరి అన్నకిళి నడుమ న్యాయస్థానంలో కేసులు నడిచాయి. చివరకు ఇరుపక్షాలు సామరస్యపూర్వక ఒప్పందం చేసుకోగా హతుడు సుబ్బయ్య తల్లి అన్నకిళికి రెండుంక్కాల్‌ ఎకరా దక్కింది. కొన్ని ఏళ్ల తరువాత అన్నపళం కుమారుడైన పొన్నుస్వామి ఆస్తి విషయంలో తన తల్లి చేసుకున్న ఒప్పందం చెల్లదు అంటూ కోర్టులో కేసు వేశాడు.

అయితే ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పును పొన్నయ్యన్‌ ధిక్కరించి సదరు స్థలాన్ని తన భార్య మేరీ పుష్పం పేరున సెటిల్‌మెంట్‌ డాక్యుమెంట్‌గా రాసిచ్చాడు. 2013లో ప్రభుత్వ విధుల నుంచి రిటైర్డ్‌ అయిన డాక్టర్‌ సుబ్బయ్య తన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమై ఆక్రమణకు గురైనట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందాడు. పొన్నుస్వామిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కన్యాకుమారి జిల్లా అంజుగ్రామంలోని కొన్ని కోట్ల రూపాయల విలువచేసే రెండుంక్కాల్‌ ఎకరాల స్థలంపై హక్కుల కోసం ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడి హత్యకు దారితీసింది.

ఈ కేసులో ప్రొఫెసర్‌ దంపతులైన పొన్నుస్వామి, మేరీ పుష్పం వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్‌ బోరిస్, న్యాయవాది విల్సన్, డాక్టర్‌ జేమ్స్‌ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్‌..ఈ పదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్‌ అప్రూవర్‌గా మారిపోయాడు. చెన్నై ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జస్టిస్‌ అల్లి బుధవారం తీర్పు చెప్పారు  పది మంది నిందితుల్లో 9 మంది దోషు లుగా నిర్ధారణైనట్లు తీర్పు చెప్పారు. పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్‌ జేమ్స్‌ సతీష్‌కుమార్, ఇంజినీర్‌ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడింది. అప్రూవర్‌గా మారిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది.  తీర్పు ఎంతో సంతృప్తికరంగా ఉందని హతుడు డాక్టర్‌ సుబ్బయ్య సతీమణి అన్నారు.  

మరిన్ని వార్తలు