పెళ్లి సందడిలో మృత్యుఘోష

31 Oct, 2020 02:34 IST|Sakshi
ఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన వాహనం

తంటికొండ క్షేత్రం ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం 

ఏడుగురు దుర్మరణం.. 9 మందికి గాయాలు 

నలుగురి పరిస్థితి విషమం 

కొండ పైనుంచి వెంకన్న ఆలయ మెట్లపైకి పలీ్టలు కొట్టిన టాటా ఏస్‌ వాహనం 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: దైవ సన్నిధి చెంత మూడుముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటైంది. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఆ పెళ్లికి అతి తక్కువ మందే హాజరైనా.. నిండు నూరేళ్లూ పచ్చగా వర్ధిల్లమని మనసారా ఆశీర్వదించారు. ఆనందోత్సాహాలతో ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో విధి వక్రించింది. పెళ్లి కుమారుడి బంధువుల్ని మృత్యువు కబళించింది. టాటా ఏస్‌ వాహనం ఘాట్‌ రోడ్డు (కొండ)పైనుంచి ఆలయం మెట్లపై పడిపోయి ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు దుర్మరణం పాలవగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తంటికొండ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఘాట్‌ రోడ్డుపై శుక్రవారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని గోకవరం మండలం ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి వీరబాబుకు, రాజానగరం మండలం వెలుగుబందకు చెందిన ప్రగడ వీరజకు గురువారం రాత్రి 11.17 గంటలకు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి సందడి ముగిశాక 2.26 గంటల సమయంలో పెళ్లి కుమారుడి తరఫు బంధువులు 16 మంది టాటా ఏస్‌ వాహనంలో తిరుగు ప్రయాణం కాగా.. బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఆ వాహనం ఘాట్‌ రోడ్డు పైనుంచి దిగువన ఉన్న మెట్ల మార్గంపైకి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో గోకవరం మండలం గంగంపాలేనికి చెందిన టాటా ఏస్‌ డ్రైవర్‌ పచి్చకూరి నరసింహదొర (29), ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి దుర్గాప్రసాద్‌ (25), పెళ్లి కుమారుడి సోదరి, గోకవరానికి చెందిన కంబాల భాను (33), రాజానగరం మండలం దివాన్‌ చెరువుకు చెందిన తల్లీకూతుళ్లు యాళ్ల నాగశ్రీలక్ష్మి (34), యాళ్ల దివ్యశివ గాయత్రి (10) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి హేమనీ శ్రీలలిత (13), పశి్చమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు సమీపంలోని తల్లాపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

నలుగురి పరిస్థితి విషమం 
ప్రమాదంలో గోకవరానికి చెందిన కంబాల వెంకటరమణ (7), మోహన సీతామహాలక్ష్మి, ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి చంద్ర (60), కోరుకొండ మండలం కాపవరానికి చెందిన జాజుల లక్ష్మన్న (45), జాజుల లక్ష్మి (40), గాదరాడకు చెందిన చాగంటి నూకరత్నం (40), చాగంటి సుజాత (38), పశి్చమ గోదావరి జిల్లా తల్లాపురానికి చెందిన సోమరౌతు వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. మరో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరిలో ఏడుగురు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోను, ఒకరు ప్రైవేట్‌ ఆస్పత్రిలోను, మరొకరు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. వీరిలో సోమరౌతు వెంకటలక్షి్మ, కంబాల మోహన సీతామహాలక్ష్మి, సింహాద్రి చంద్ర, చాగంటి సుజాత పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్‌ రోడ్డుపై నుంచి వాహనం కిందకు పడిపోయినప్పుడు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి నిద్ర లేచారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ శేముషీబాజ్‌పాయి ప్రమాద ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 

ప్రమాద కారణాలపై భిన్న కథనాలు 
ప్రమాదానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్‌ వాహనం ఘాట్‌ రోడ్డు మీదుగా కిందకు దిగే సమయంలో డ్రైవర్‌ నరసింహదొర హ్యాండ్‌ బ్రేక్‌ తీయగానే వాహనం ముందుకు కదలిందని.. డ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు వచి్చన కార్లను కొండ దిగువన పార్క్‌ చేయగా.. ప్రమాదానికి కారణమైన వాహనం సెల్ఫ్‌ మోటార్‌ పని చేయకపోవడంతో డ్రైవర్‌ వాహనాన్ని నేరుగా కొండపైకి పోనిచ్చాడని చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో వాహనం కొండ పైనుంచి దిగువకు వచ్చేప్పుడు సులభంగా స్టార్ట్‌ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేశాడని తెలుస్తోంది. అయినా వాహనం స్టార్ట్‌ కాకపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు దానిని తోస్తుండగా బ్రేక్‌ ఫెయిలై.. ప్రమాదం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది. కొండపై గల ఘాట్‌ రోడ్డు నుంచి సుమారు 20 అడుగుల దిగువకు వాహనం బోల్తా కొట్టడంతో ఆలయ మెట్ల మార్గం రక్తసిక్తమైంది. మెట్ల మార్గంపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో ఘటనా స్థలం హృదయ విదారకంగా కనిపించింది. వాహనంలోని పెళ్లి సామగ్రి కూడా అదే ప్రాంతంలో చెల్లాచెదురుగా పడింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు