విషాదం: యమపాశమైన చున్నీ

31 Oct, 2020 08:14 IST|Sakshi
మల్లికార్జున్‌ మృతదేహం

మంచానికి ఊయల కట్టి ఊగుతుండగా జరిగిన ప్రమాదం

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): సరదాగా ఊయల ఊగడానికి మంచానికి కట్టిన చున్నీ ఓ బాలుడి పాలిట యమపాశమైంది. పనిమీద బయటకు వెళ్తూ బాలుడిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. చున్నీ మెడకు చుట్టుకొని అనుమానాస్పద స్థితిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట్‌ మండలం ఎల్లసఖి గ్రామానికి చెందిన అంజలి, నర్సింహ దంపతులు టైలర్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌ చర్చి లేన్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మల్లికార్జున్‌(7) మూడో తరగతి చదువుతున్నాడు. నిత్యం సరదాగా అల్లరిచేసే మల్లికార్జున్‌ ఇంట్లో కంటే ఎక్కువగా బయటికి పరుగులు తీస్తుంటాడు. (చదవండి: ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరుతో..)

గురువారం ఉదయం 11 గంటలకు అంజలి, నర్సింహ దంపతులు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో కొడుకులిద్దరినీ ఇంట్లో ఉంచి బయటి నుంచి తాళం వేసి వెళ్లారు. అన్నం తిన్న తరువాత చిన్నకొడుకు నిద్రించాడు. మల్లికార్జున్‌ మాత్రం మంచానికి, కిటికీ ఊచలకు చున్నీని కట్టి ఊయల ఊగసాగాడు. ప్రమాదవశాత్తు మంచం పైనుంచి జారడంతో చున్నీ మెడకు చుట్టుకుంది. నిద్రిస్తున్న సోదరుడు లేచి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. బయటి నుంచి తాళం వేసి ఉండటంతో కిటికీకి చున్నీతో వేలాడుతున్న మల్లికార్జున్‌ను దింపాల్సిందిగా తమ్ముడికి సైగలు చేశారు. దీంతో మెడకు చుట్టుకున్న చున్నీని విప్పగా మల్లికార్జున్‌ కిందకు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఇదిలాఉండగా తన కొడుకు ఐరన్‌ పైప్‌కు చున్నీతో మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లి సందడిలో మృత్యుఘోష)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు