మైనింగ్‌ పేరుతో టోకరా!

17 Sep, 2022 08:36 IST|Sakshi

పంజగుట్ట: మైనింగ్‌లో లాభాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మాజీ మంత్రి సీనియర్‌ కాగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. టౌలీచౌకీకి చెందిన వ్యాపారి మహ్మద్‌ అబ్దుల్‌ వాహబ్‌కు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి మోహ్సిన్‌ ఖాన్‌ పరిచయం ఉంది. మోహ్సిన్‌ ఖాన్‌ తనకు బంజారాహిల్స్‌లో సన్‌లిట్‌ మైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రిజిస్టర్‌ సంస్థ ఉందని దానికి తానే ఎండీనని చెప్పాడు.

తపస్వీ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఖమ్మ జిల్లా, రామానుజవరంలో 46 ఎకరాల్లో ఇసుక మైనింగ్‌ టెండర్‌ దొరికిందని, ఆ సంస్థతో తమ సంస్థ 25 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 25 శాతం వాటాలో సుమారు రూ.6.5 కోట్లు లాభం వస్తుందని అబ్ధుల్‌ వాహబ్‌ను నమ్మించాడు. రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించాడు. తనతో చేతులు కలిపితే నీకు 50 శాతం వాటా ఇస్తానని అందుకుగాను రూ.90 లక్షలు చెల్లించాలని కోరాడు.

మోహ్సిన్‌ ఖాన్‌ చెప్పిన మాటలు అబ్థుల్‌ వాహబ్‌  నమ్మక పోవడంతో తన మామ జూబ్లీహిల్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు మొహ్మద్‌ అలీ షబ్బీర్‌ను (షబ్బీర్‌ అలీ)ని పరిచయం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్‌ మంత్రిగా చేయడంతో బాధితుడు అబ్థుల్‌ వాహబ్‌ అతడిని గుర్తుపట్టాడు. కుందన్‌బాగ్‌లో ఉంటున్న మాజీ పోలీస్‌ ఉన్నతాధికారి అబ్థుల్‌ ఖయ్యూం ఖాన్‌ (ఏకే ఖాన్‌)ను కూడా అతడికి పరిచయం చేశాడు.

దీంతో అబ్థుల్‌ వాహబ్‌ అతడి మాటలు నమ్మి 2016లో బ్యాంకు ద్వారా, నగదు ద్వారా రూ.90 లక్షలు చెల్లించాడు. సంవత్సరాలు గడుస్తున్నా లాభం ఇవ్వకపోగా మొహం చేయడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోహ్సిన్‌ ఖాన్‌ బాధితుడిని బెదిరించడం, తప్పించుకుని తిరగడం చేస్తుండడంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలమేరకు పంజగుట్ట పోలీసులు  మోహ్సిన్‌ ఖాన్, మొహ్మద్‌ అలీ షబ్బీర్, అబ్థుల్‌ ఖయ్యూం ఖాన్‌లపై 465, 420, 406, ఐపీసీ రెండ్‌విత్‌ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.   

(చదవండి: సెల్‌ఫోన్‌ వాడడు..సీసీ కెమెరాకు చిక్కడు..శ్మశానంలోనే తిండి నిద్ర)

మరిన్ని వార్తలు