చంపి కాల్చేస్తానన్నాడు.. మోచేతితో కొట్టి.. రెయిలింగ్‌ పైనుంచి దూకి..

18 Nov, 2021 06:49 IST|Sakshi

వివరాలు వెల్లడించిన సినీనటి షాలూ చౌరాసియా 

గచ్చిబౌలి: దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించినట్లు సినీనటి షాలూ చౌరాసియా అన్నారు. బుధవారం కొండాపూర్‌లో మీడియాతో కేబీఆర్‌ పార్కు ఘటనను వివరించారు. కేబీఆర్‌ పార్కు సీవీఆర్‌ గేట్‌ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. మెయిన్‌ గేట్‌ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు.

తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడని.. ఫోన్‌ పే చేస్తానని డయల్‌ 100కు రెండుసార్లు ఫోన్‌ చేశాని చెప్పారు. గమనించిన దుండగుడు తన సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడని పేర్కొన్నారు. హెల్ప్‌ అంటూ అరుస్తుండగా అదే పనిగా చేతులు, ముఖంపై దాడి చేశాడని వివరించారు.  బండరాయిపైకి తోసివేయడంతో స్పృహ తప్పానని, కొద్ది సేపటికి తేరుకున్నానని చెప్పారు.  

బండరాయితో ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా మోచేతితో ప్రైవేట్‌ పార్ట్‌పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు చేరుకున్నానని తెలిపారు. ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్‌ అని అరవడంతో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపై అనుమానం లేదన్నారు. కేబీఆర్‌ పార్క్‌లో లైటింగ్‌ అమర్చాలని ఎఫ్‌డీసీ అధికారులకు సూచించారు. పోలీసులు బాగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. తన చేతికి ఉన్న డైమండ్‌ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు.


 

మరిన్ని వార్తలు