బతుకు బోల్తా; ఆరుగురు దుర్మరణం

19 Apr, 2021 11:14 IST|Sakshi

ఆరుగురు వలస కూలీల దుర్మరణం

ఎదురుగా వచ్చి ఢీకొట్టిన కారు.. అదుపుతప్పి పల్టీ కొట్టిన లారీ 

అక్కడికక్కడే ముగ్గురు మృతి.. ఆస్పత్రిలో మరో ముగ్గురు

మరో నలుగురి పరిస్థితి విషమం

మృతుల్లో నలుగురిది ఒడిశా, ఇద్దరిది ఛత్తీస్‌గఢ్‌.. షాబాద్‌ రోడ్డుపై మసీదు గడ్డ వద్ద ప్రమాదం

శంషాబాద్‌: పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం దాటివచ్చిన వలస కూలీల బతుకులను రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసింది. వీరు ప్రయాణిస్తున్న లారీని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్‌ లారీని ఒక్కసారిగా రోడ్డు కిందకు దించడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణ పరిధిలోని షాబాద్‌ రహదారి మసీదు గడ్డ వద్ద చోటు చేసుకుంది.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని నర్కూడ రెవెన్యూ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో చందర్‌ అనే ఇటుక బట్టీ నిర్వాహకుడి వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది కూలీలు యజమాని ఏర్పాటు చేసిన లారీలో ఆదివారం శంషాబాద్‌ వచ్చి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేసి సాయంత్రం 6:10 గంటలకు తిరిగివెళ్తున్నారు. సరిగ్గా 6: 20 గంటలకు వీరు ప్రయాణిస్తున్న లారీ మసీదు గడ్డకు చేరుకుంది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కారును తప్పించే క్రమంలో లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా వాహనాన్ని ఎడమవైపునకు తిప్పాడు. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తాపడింది.

ఇందులో ప్రయాణిస్తున్న ఒడిశాలోని బలాంగర్‌ జిల్లా చనవాహాల్‌ గ్రామానికి చెందిన కలాకుమార్‌ (25), గోపాల్‌దీప్‌ (45), కృపాసునా (40) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఒడిశాకు చెందిన సహదేవ్‌ (45), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హక్తు (40), పరమానంద్‌ (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయాలపాలైన క్రిష్ణ, మంచన్, సత్యపాల్‌దీప్, ముఖేష్, రవీంద్రసునాతోపాటు మరికొందరిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు. లాక్‌డౌన్‌ అనంతరం ఒడిశా నుంచి 50 మందికిపైగా కార్మికులు ఐదు నెలల క్రితం నర్కూడలోని ఇటుకబట్టీల్లో పని చేసేందుకు వచ్చారు. 

మద్యం మత్తులోనేనా...! 
ప్రమాదానికి కారణమైన కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వీరిలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నర్సింహ, గిరితోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వీరు సమీపంలోనే ఉన్న సదరన్‌ వెంచర్‌లో మద్యం తాగి శంషాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు సమాచారం. వీరు మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం లేదు.

తీరని విషాదం..
సాయంత్రం 6.20 గంటలకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు చొరవ తీసుకుని బాధితులకు సాయం అందించారు. పోలీసులు, 108కు సమాచారం అందించినా వెంటనే స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 7.10 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను తరలించారు. అప్పటికే స్థానికులు కొంతమందిని ప్రైవేటు ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. రోడ్డుపై పడిపోయిన లారీని తొలగించడానికి చాలా సమయం పట్టింది. లారీ కింద ఇరుక్కుపోయిన కలాకుమార్‌ మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. కలాకుమార్‌ మృతదేహాన్ని పట్టుకుని అతడి భార్య గుండెలవిసేలా రోదించింది. మృతిచెందిన వారు ముగ్గురూ వివాహితులే. ఘటనా స్థలం వద్ద మృతుల భార్యలు, పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

నా కళ్లముందే..: కలాకన్‌ సునా, ప్రత్యక్ష సాక్షి
మొత్తం 30 మందిమి సరుకులు తీసుకుని వెళుతున్నాం. కారు స్పీడుగా వచ్చి లారీని ఢీకొట్టింది. నా కళ్లముందే నా తమ్ముడు కలాకుమార్‌ సునా కూడా లారీ కింద నలిగిపోయి చనిపోయిండు. బతుకు దెరువు కోసం బలాంగర్‌ జిల్లా చనవాహాల్‌ నుంచి ఇక్కడి వచ్చినం.

మంత్రి సబిత దిగ్భ్రాంతి
లారీ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతిచెందిన ఘటనపై మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. 

ప్రమాదకరంగా శంషాబాద్‌–షాబాద్‌ రహదారి
శంషాబాద్‌ రూరల్‌: రోడ్డుపై వాహనాల రద్దీ.. మితిమీరిన వేగం.. ట్రాఫిక్‌ నిబంధనల బేఖాతరు వలస కూలీల ప్రాణాలను బలిగొన్నాయి. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్‌– షాబాద్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ పెరిగిపోయింది. రెండు లైన్ల దారిగా ఉన్న ఈ మార్గంలో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. పైగా దుర్ఘటన జరిగిన ప్రదేశం ఎత్తుగా ఉండడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో కవ్వగూడ వెళ్లే మార్గం వద్ద మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసం తవ్విన కాలువను పూడ్చి వేయగా.. అక్కడ గుంతలు పడ్డాయి.

అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై ఓ వైపు సిమెంటుతో గుంతను పూడ్చివేయగా.. అది కాస్త ఎత్తుగా మారింది. దీంతో శంషాబాద్‌ నుంచి షాబాద్‌ వెళ్లే వాహనదారులు ఇక్కడికి రాగానే కుడి వైపు నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాళ్లగూడ నుంచి రహదారి పూర్తిగా చీకటిగా ఉంటుంది. అమ్మపల్లి, నర్కూడ సమీపంలో ఉన్న మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.

లారీల్లో జనం తరలింపు..
నిబంధనలకు విరుద్ధంగా జనాలను లారీల్లో తరలిస్తున్నారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి, కవ్వగూడ, నర్కూడ శివారుల్లో పదికి పైగా ఇటుక బట్టీలున్నాయి. ఇందులో వందల కుటుంబాలు పని చేస్తున్నాయి. వీరంతా సరుకులు, కూరగాయల కోసం ప్రతీ ఆది, గురువారాల్లో శంషాబాద్‌ వస్తుంటారు. ఇందుకోసం బట్టీల నిర్వాహకులు కూలీలను లారీల్లోనే పంపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా కూలీలను లారీల్లో తరలిస్తుండటంతో ప్రమాదాల సమయంలో వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మార్గంలో ఆటోల్లో సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో అతివేగంతో తిరుగుతుంటాయి.

మరిన్ని వార్తలు