పెట్టుబడుల పేరుతో రూ.2.36 కోట్లు స్వాహా 

7 Sep, 2020 08:26 IST|Sakshi

తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులు 

సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు   

సాక్షి, హైదరాబాద్‌: తన వద్ద పెటుబడి పెట్టిన మొత్తాలను షేర్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తానని, డిపాజిట్‌దారులకు నెలకు 3 శాతం వడ్డీ ఇస్తానంటూ రూ.2.36 కోట్లు స్వాహా చేసిన నిందితుడిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి మాజీ పోలీసు అధికారి కావడంతో డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే బెదిరిస్తున్నాడంటూ బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..శాంతినగర్‌లో ని ఓ మత సంస్థలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సయ్యద్‌ ముక్తర్‌ అలీ ఎంబీఏ పూర్తి చేశాడు. విజయ్‌నగర్‌ కాలనీతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన పలువురితో ఇతడు పరిచయం పెంచుకున్నాడు. తాను తిజార్హా స్టాక్‌ ఇన్వెస్టిమెంట్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నానని, దీని ద్వారా షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందుతున్నానని నమ్మబలికాడు. (ఇంటి దొంగ దొరికాడు)

తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి నెలకు 3 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ చెప్పాడు. దీంతో రియాజ్‌ అనే వ్యక్తితో పాటు మొత్తం 39 మంది రూ.2.6 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీరికి గత ఏడాది పత్రాలు కూడా రాసి ఇచ్చాడు. తన మకాంను శాంతినగర్‌ నుంచి బజార్‌ఘాట్‌కు మార్చాడు. పెట్టుబడిదారులకు కొన్నాళ్లు లాభాలు ఇచ్చినా... ఆపై చేతులెత్తేశాడు. చివరకు తన స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పన్నపల్లికి పారిపోయాడు. అతికష్టమ్మీద అతగాడి చిరునామా కనుక్కొని అక్కడికి వెళ్లిన వారిని బెదిరించాడు. తన తండ్రి మాజీ పోలీసు అధికారి అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు