శశిథరూర్‌ సహా ఏడుగురిపై దేశద్రోహం కేసులు

30 Jan, 2021 00:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మక ఘటనలపై ట్వీట్లతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్, మరో ఆరుగురు జర్నలిస్టులపై మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటాక భోపాల్‌లో శశిథరూర్, ఇండియా టుడే జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, నేషనల్‌ హెరాల్డ్‌ సీనియర్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ మృణాల్‌ పాండే, క్వామి అవాజ్‌ ఎడిటర్‌ జఫర్‌ అఘా, ది కార్వాన్‌ మ్యాగజైన్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ పరేష్‌ నాథ్, ఎడిటర్‌ అనంత్‌ నాథ్, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వినోద్‌ కే జోస్‌తోపాటు మరో వ్యక్తిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎర్రకోట వద్ద ఆ రోజు చెలరేగిన హింసపై ట్విటర్‌లో వారు షేర్‌ చేసిన సమాచారం జాతీయ భద్రతకే ముప్పులా మారిందని సంజయ్‌ రఘువంశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

కేసు వెనక్కి తీసుకోవాలి: ఎడిటర్స్‌ గిల్డ్‌  
సీనియర్‌ జర్నలిస్టులపై నమోదైన పోలీసు కేసుల్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండించింది. ఈ రకంగా కేసులు నమోదు చేయడం మీడియాని బెదిరించడమేనని  ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ఎఫ్‌ఐఆర్‌లు వెంటనే వెనక్కి తీసుకొని మీడియా నిర్భయంగా, స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించాలంది.  మృణాల్‌ పాండేపై కేసు నమోదవడాన్ని ది ఇండియన్‌ వుమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌ (ఐడబ్ల్యూపీసీ)ఖండించింది.  

మరిన్ని వార్తలు