నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత

13 Sep, 2022 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్‌ నిఘా వేశాయి.

మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్‌ కృషిని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

విద్యార్థినులపై హెచ్‌ఎం అసభ్యకర ప్రవర్తన 
మహబూబాబాద్‌ రూరల్‌: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్‌ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్‌ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం షేక్‌ సర్వర్‌ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్‌ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం రాందాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్‌ పాషాను సస్పెండ్‌ చేశారు. (చదవండి: హాస్టల్‌లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..)

మరిన్ని వార్తలు