‘ఆ నేరాలు చేసింది ట్రాన్స్‌జెండర్‌’ 

20 Nov, 2021 10:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన రాజేందర్, కొండాపూర్‌లోని టీఎస్‌పీఎస్పీ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ల నుంచి ఆదివారం ల్యాప్‌టాప్, బంగారు గొలుసులు కాజేసింది ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. బెంగళూరు నుంచి వచ్చి, లాడ్జిలో బస చేసి, లిఫ్ట్‌ తీసుకుని ఈ నేరాలకు పాల్పడిన అంజుమ్‌తో పాటు ఆమెకు సహకరిస్తున్న అనుచరుడు బసవరాజ్‌ను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు.  

బెంగళూరులోని ప్రగతి లేఔట్‌ ప్రాంతానికి చెందిన అంజుమ్‌ ఎనిమిదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారింది. చిన్న చిన్న పనులు చేసి పొట్టపోసుకునే ఈమె అప్పుడప్పుడు హైదరాబాద్‌ వచ్చి ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఉండి వెళ్లేది. ఆమెకు ఇటీవల బెంగళూరుకు చెందిన చిరు వ్యాపారి బసవరాజ్‌తో పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటున్న ఇరువురూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారు. 

అందుకు అవసరమైన డబ్బు కోసం నేరాలు చేయాలని పథకం వేశారు. ఈ నెల 12న వీరి ద్దరూ విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు.  అదే రోజు రాత్రి రాజేందర్‌ అనే వ్యక్తి కారులో మారేడ్‌పల్లి నుంచి బేగంపేట వెళ్తుండగా ప్యారడైజ్‌ సర్కిల్‌ వద్ద అంజుమ్‌ లిఫ్ట్‌ అడిగింది. కారు ఎక్కిన ఆమె రాజేందర్‌తో అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆయన సీటీఓ జంక్షన్‌ వద్ద కారు దిగమన్నాడు. అదును చూసుకున్న అంజుమ్‌ ఆయన మెడలోని గొలుసు, వెనుక సీటులో ఉన్న ల్యాప్‌టాప్‌ తీసుకుని ఉడాయించింది. దీనిపై బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.  అదే రోజు అమీర్‌పేట మార్కెట్‌ వద్దకు చేరుకున్న అంజుమ్‌ అటుగా బైక్‌పై వస్తున్న ఈశ్వర్‌ ప్రసాద్‌ను లిఫ్ట్‌ అడిగింది. పంజగుట్ట చౌరస్తా వరకు ప్రయాణించి ఆయన మెడలో ఉన్న చైన్‌ తస్కరించి దిగిపోయింది. 

దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. తొలుత ఇది యువతి చేసిన పనిగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ ఆధారంగా ట్రాన్స్‌జెండర్‌ పనిగా తేల్చారు. ఆ ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు అంజుమ్‌తో పాటు ఆ సొత్తు విక్రయిస్తున్న బసవరాజ్‌ను వారు బస చేసిన లాడ్జి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు సొత్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు.    

మరిన్ని వార్తలు