చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్‌ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు

23 Nov, 2022 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ చేస్తున్న కొద్ది ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు శ్రద్ధా వాకర్‌ తన ప్రియుడు అఫ్తాబ్‌ అమీన్‌ పునావాలాపై నవంబర్‌ 23, 2020న మహారాష్ట్రాలోని వసాయ్‌లోని తిలుంజ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది.  అఫ్తాబ్‌ దారుణంగా కొడుతున్నాడని, చంపి ముక్కలుగా చేస్తానంటూ బెదిరిస్తున్నాడని శ్రద్ధా ఫిర్యాదు చేసిందని పోలీసులు  చెప్పారు. అతడి హింసాత్మక ప్రవర్తన గురించి అఫ్తాబ్‌ కుటుంబానికి కూడా తెలుసని పేర్కొన్నారు.

కాగా, శ్రద్ధా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో... అఫ్తాబ్‌ ఈ రోజు నన్ను ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను చంపి ముక్కలుగా నరికి దూరంగా విసిరేస్తానని బెదిరించాడు. అతను నన్ను కొట్టి ఆరు నెలలైంది, కానీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు కాబట్టి పోలీసులను ఆశ్రయించే ధైర్యం నాకు లేదు. నన్ను చంపడానికి ప్రయత్నించినట్లు అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. అలాగే మేము కలిసి ఉంటున్నట్లు కూడా అతడి తల్లిదండ్రులకు తెలుసు. ఎప్పటికైనా మేము పెళ్లి చేసుకోవాల్సిందే.

మాకు అతడి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఉంది. కానీ నేను ఇప్పుడూ అఫ్తాబ్‌తో కలిసి జీవించేందుకు ఇష్టపడటం లేదు. నేను ఎప్పుడైన తనకంట పడ్డ నన్ను హింసించి, చంపేసే ప్రయత్నం చేయవచ్చు లేదంటే బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉన్నందున నేను ఏవిధంగానైనా  దారుణంగా గాయపడినట్లయితే దానికి కారణం అఫ్తాబేనని లేఖలో పేర్కొంది. ఐతే ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు కలగజేసుకుని మాట్లాడటంతో ఆమె మా మధ్య ఎలాంటి గొడవలు లేవని లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చి, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్‌ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారని వారి నుంచి కూడా స్టేమెంట్‌ తీసుకుంటున్నామని చెప్పారు.  

ఐతే శ్రద్ధా అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేసిన సమయంలో తన సహోద్యోగుల్లో ఒకరైన కరణ్‌తో ఆమె ఈ దాడి గురించి చెబుతూ గాయపడిన ఫోటోను వాట్సాప్‌లో షేర్‌ చేసిన దానితో సరిగ్గా ఈ మేటర్‌ లింక్‌ అవుతోందని పోలీసులు చెప్పారు. ఐతే ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే ఆమెపై ఆరునెలలుగా దాడి చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసినప్పుడూ... ఆమె అతడితో ఎంత కాలం వేరుగా ఉంది అనేదానిపై స్పష్టత లేదని చెప్పారు. ఐతే విచారణలో ఆ జంట ఢిల్లీ వెళ్లడానికి ముందు ఈ ఏడాది ప్రారంభంలో సెలవులకు హిమచల్‌ప్రదేశ్‌ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

(చదవండి: శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్‌ కస్టడీ పొడిగింపు)

మరిన్ని వార్తలు