శ్రద్ధ వాకర్ హత్య కేసు.. అడవిలో పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు

20 Nov, 2022 21:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు మెహ్రౌలీ అడవిలో ఆదివారం వెతికారు. పుర్రె, దవడ భాగాలతో పాటు మరికొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధవో కావో నిర్ధరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మిగతా శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో ‍గజ ఈతగాళ్లతో అందులో వెతికించారు పోలీసులు. శ్రద్ధ శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు.

ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధవో కావో నిర్ధరించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా డీఎన్‌ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్‌ ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీ మెహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అఫ్తాబే తన ప్రేయసిని చంపేసి శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల పాటు శరీర భాగాలను పడేశాడు.
చదవండి: నైట్ క్లబ్‌లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..

మరిన్ని వార్తలు