మెజిస్ట్రేటే తప్పు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు

10 Nov, 2021 02:12 IST|Sakshi
ఎస్సై వెంకటేశ్వర్లు 

ఐఓ సురేందర్‌ రెడ్డి రికార్డులు కూడా తప్పే 

దిశ కమిషన్‌కు నందిగామ ఎస్సై వాంగ్మూలం 

కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామంటూ జస్టిస్‌ సిర్పుర్కర్‌ ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: షాద్‌నగర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ తప్పని అప్పటి నందిగామ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు దిశ కమిషన్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కే ఉషారాణి అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం మాత్రమే ఇచ్చానని.. వాళ్లేం రాసుకున్నారో తనకి తెలియదని వివరించారు. న్యాయస్థానంలో నిజమే చెప్తానని ప్రమాణం చేసి, రాతపూర్వకంగా అఫిడవిట్‌లో పేర్కొని, సంతకాలు చేసిన స్టేట్‌మెంట్‌ను ఇప్పుడు తప్పని తెలపడంపై కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్రిసభ్య కమిషన్‌ అడిగిన చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిర్పుర్కర్‌.. ఇలా ప్రవర్తించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ షాద్‌నగర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు. దిశ ఘటన సమయంలో నందిగామ ఎస్సైగా ఉన్న వెంకటేశ్వర్లును సిర్పుర్కర్‌ కమిషన్‌ మంగళవారం విచారించింది.

2019, డిసెంబర్‌ 5న దిశ హత్యాచార నిందితులు నలుగురిని మియాపూర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌కు అప్పగించినట్లు విచారణాధికారి (ఐఓ) జే సురేందర్‌ రెడ్డి తప్పుగా రికార్డ్‌ చేశారని వెంకటేశ్వర్లు చెప్పారు. వాస్తవానికి ఆ రోజు మధ్యరాత్రి ఒంటి గంటకు శంకర్‌పల్లిలోని రవి గెస్ట్‌ హౌస్‌లో ఏసీపీ చంద్రశేఖర్‌కు నిందితులను కస్టడీకి అప్పగించామన్నారు. 2019, డిసెంబర్‌ 7న ఉదయం 11:50 గంటలకు షాద్‌నగర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందు స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్న విషయం గుర్తు లేదని తెలిపిన మీరు.. అదే రోజు ఉదయం 8 గంటలకు మాత్రం విచారణాధికారి (ఐఓ) జే సురేందర్‌ రెడ్డికి ఆ రోజు ఘటన గురించి పూసగుచ్చి ఎలా వివరించగలిగారని కమిషన్‌ ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ తాను అప్పటికే గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నానని.. తలకి తగిలిన దెబ్బ నొప్పి పెరుగుతుండటంతో గుర్తు లేదని చెప్పాడు. స్పృహ కోల్పోవటం, తల తిరగడం మధ్య తేడా తనకి తెలియదని, అందుకే స్పృహ కోల్పోయానని చెప్పానన్నారు. 

ఫోన్‌ పడిపోయిందన్న విషయం తెలపలేదు
నిందితుడు జొల్లు నవీన్‌ తన కళ్లలో మట్టి విసిరి, రాళ్లతో కొట్టాడని దీంతో నుదురు, తల, మెడపై గాయాలయ్యాయని వెంకటేశ్వర్లు కమిషన్‌కు చెప్పారు. ఐఓ, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్, అఫిడవిట్లో, వైద్యులకు ఎక్కడా కూడా తల, మెడపైన గాయాలయ్యాయన్న విషయాన్ని ఎందుకు తెలపలేదని ప్రశ్నించగా.. అంతగా అవసరంలేదనిపించిందని సమాధానం ఇచ్చారు.

2019 డిసెంబర్‌ 6 నాటి సీజర్‌ రిపోర్టులో సంఘటన స్థలంలో రక్తం అంటిన ఖాకీ దుస్తులు, నలుపు రంగు పిస్టల్‌ పర్సు ముక్కను స్వాధీనం చేసుకున్నామని ఐఓ సురేందర్‌ రెడ్డి తప్పుగా నమోదు చేశారని, వాస్తవానికి 7వ తేదీన ఉదయం 8–8:30 గంటల సమయంలో ఐసీయూలో తనని విచారించేందుకు వచ్చిన సురేందర్‌ రెడ్డి చేతికి రక్తం అంటిన దుస్తులు, పిస్టల్‌ పర్స్‌ను ఇచ్చానని వెంకటేశ్వర్లు తెలిపారు.

చెన్నకేశవులు మిమ్మల్ని నేల మీదకి తోసేశాడని ఏ రిపోర్ట్‌లోనూ ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించగా.. ఐఓ సురేంద ర్‌రెడ్డికి తెలిపానని బదులిచ్చారు. ఆ తోపులాటలో తన ఫోన్‌ కూడా ఘటనా స్థలంలో పడిపోయిందని కమిషన్‌కు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు