మూగజీవిని దారుణంగా హత్య చేసిన సైకో

7 Aug, 2020 18:04 IST|Sakshi

గాంగ్‌టక్‌‌: ఈ మధ్య కాలంలో నోరులేని మూగ జీవాలను చంపుతున్న మానవ మృగాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మూగ జీవాలను దారుణంగా హింసించి సైకోల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సిక్కింలో చోటు చేసుకుంది. బంధువులతో గొడవ పడిన ఓ వ్యక్తి వారి పెంపుడు కుక్కను అత్యంత దారుణంగా చంపేశాడు. కుక్కల పండుగ నాడే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వివరాలు.. తూర్పు సిక్కిం మానే దారా గ్రామానికి చెందిన నరెన్‌ తమంగ్‌ అనే వ్యక్తి కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న నరెన్‌కు అతడి బంధువుకు మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ కోపాన్ని నిందితుడు‌ అతడి పెంపుడు కుక్క మీద చూపించాడు. (కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి)

బంధువు పెంపుడు కుక్కను దారుణంగా హత్య చేశాడు నరెన్‌. అనంతరం మృతదేహాన్ని కొండపై నుంచి విసిరి సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించాడు. కానీ బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కుక్క మృతదేహాన్ని గుర్తించారు. దానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లు నరెన్‌ కృరత్వానికి భయపడిపోయారు. ‘నిందితుడు కుక్క తలపై, నోటిపై పొడిచాడు. దాని నాలుకను ముక్కలు చేశాడు. పాపం ఆ మూగజీవి తన ప్రాణాలు కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. సాయం కోసం అరిచింది.

దురదృష్టవశాత్తు దాని యజమానురాలు దారుణం జరుగుతున్నప్పుడు అక్కడే ఉంది కానీ.. నరెన్‌ చేష్టలకు భయపడి పోయింది. సగం స్పృహలో ఉన్న ఆ కుక్కపిల్ల పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ నరెన్‌ మళ్లీ దాన్ని పట్టుకుని చెవి కత్తిరించి.. తలపై కొట్టాడు. ఆ తర్వాత దాన్ని తన ఇంటి దగ్గర ఉన్న కొండపైకి విసిరాడు’ అని తెలిపారు పోలీసులు. తాను ఎంత ప్రమాదకరమైన వాడో తన బంధువులకు తెలియజెప్పేందుకే నరెన్‌ ఈ నేరానికి పాల్పడ్డాడన్నారు పోలీసులు. మూగజీవిని ఇంత దారుణంగా హింసించి చంపిన నరెన్‌కు కఠిన శిక్ష విధించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. (వణికించిన బర్మా కొండచిలువ)

మరిన్ని వార్తలు