భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు

28 Feb, 2021 11:47 IST|Sakshi

ఇల్లెందు: భూమి కంపించడంతో ఇళ్లన్నీ ఊగిపోయాయి. అరుపులు, కేకలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. చుట్టూ కమ్ముకున్న పొగతో ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఆందోళనలో పడ్డారు. అయితే ఇదంతా  వారికి నిత్యకృత్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఓసీ పరిధిలోని ప్రాంతంలో ప్రతిరోజూ మధ్యాహ్నం ఓసీలో బొగ్గు కోసం సింగరేణి అధికారులు బ్లాస్టింగ్‌ చేపడతారు. ఈ క్రమంలో వాటి శబ్దాలకు శనివారం  భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

కొంతకాలంగా ఓసీ బ్లాస్టింగ్‌ శబ్దాలు, భూమి కంపనాలతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సింగరేణి అధికారులకు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని 14, 15, 16 నంబర్‌ బస్తీలకు చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు దఫాలుగా రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పరిష్కారం చూపడం లేదంటున్నారు. ఓసీ బ్లాస్టింగ్‌లతో గోడలు బీటలు వారి ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

చదవండి: బాస్మతి బియ్యంతో ‘తిన్నంత బిర్యానీ’

మరిన్ని వార్తలు