సింగిల్‌ హ్యాండ్‌ స్నాచర్‌!

31 Jul, 2020 08:55 IST|Sakshi

  పౌల్ట్రీ ఫామ్‌ కోల్పోవడంతో నేరాల బాట 

మహారాష్ట్రలో మూడు నెలల్లో 47 నేరాలు

నగరంలో వరుస స్నాచింగ్‌లు ఒక్క రోజే రెండు ఠాణాల పరిధిలో పంజా 

అరెస్టు చేసిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో కనీసం ఇద్దరు నిందితులు ఉంటుంటారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పంజా విసురుతుంటారు. ఒకరు వాహనం నడిపితే... మరొకరు వెనుక కూర్చుని టార్గెట్‌ చేసిన వారి మెళ్లో గొలుసులు లాగేస్తుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరగాడు శంకర్రావు బిరాదర్‌ స్టైలే డిఫరెంట్‌ ఇతగాడు సింగిల్‌గానే సంచరిస్తూ స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టాడు. ఈ ఘరానా నేరగాడిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.  

పౌల్ట్రీ ఫామ్‌ సోదరుడి పాలుకావడంతో... 
మహారాష్ట్రలోని లాథూర్‌ జిల్లా, ప్రకాష్‌నగర్‌కు చెందిన శంకర్రావు తన స్వస్థలంలో సోదరుడితో కలిసి పౌల్ట్రీ ఫామ్‌ ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి వ్యాపారం సజావుగానే సాగింది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో శంకర్రావు తమ్ముడి బుద్ధి మారింది. ఆ ఫౌల్ట్రీ ఫామ్‌ను సొంతం చేసుకున్న అతగాడు శంకర్రావును వెళ్లగొట్టాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లాథూర్‌కు చెందిన రాజు అనే పాత నేరగాడితో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018లో కేవలం మూడు నెలల్లోనే 47 నేరాలు చేశారు. వీటిలో 33 చైన్‌ స్నాచింగ్స్‌ కాగా... 14 బైక్‌ చోరీ కేసులు ఉన్నాయి. పుణే కమిషనరేట్‌ పరిధిలోని 20 పోలీసుస్టేషన్లలో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన అక్కడి పోలీసులు రాజును గుర్తించారు. దీంతో వలపన్ని అతడితో పాటు శంకర్రావును 2018 సెప్టెంబర్‌లో పుణేలోని హడప్సర్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

అలా కాకూడదనే... 
పుణేలో తాను చిక్కడానికి రాజుతో జట్టు కట్టడమే కారణమని భావించిన శంకర్రావు మరోసారి అలా జరగకూడదని జైల్లో ఉండగానే నిర్ణయించుకున్నాడు. యరవాడ సెంట్రల్‌ జైలు నుంచి ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయిన ఇతగాడు ఆపై తాను ఎవరో తెలియని హైదరాబాద్‌ నగరాన్ని టార్గెట్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసపెట్టి 20–30 స్నాచింగ్స్‌ చేసి స్వస్థలానికి వెళ్ళిపోవాలని పథకం వేశాడు. ఈ నెల మొదటి వారంలో నగరానికి వచ్చిన ఇతను దినసరి కూలీగా చెప్పుకుంటూ కాటేదాన్‌ ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 19న లంగర్‌హౌస్‌ పరిధిలో ఓ బైక్‌ చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ రెక్కీ చేసిన ఇతగాడు ఆదివారం రంగంలోకి దిగాడు. కాచిగూడ, ఎస్సార్‌నగర్‌ పరిధిల్లో రెండు స్నాచింగ్స్‌ చేశాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌ స్వామిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ సేకరించిన వారు దానిని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఫలితంగా నిందితుడి గుర్తించి గురువారం పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 5.5 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు