విషాదం: గుండెపోటుతో జగదీష్‌.. మనోవేదనతో శిరీష..

9 Jan, 2021 10:30 IST|Sakshi
జగదీష్, శిరీష దంపతులు (ఫైల్‌)

అక్టోబర్‌లో ప్రేమ వివాహం

సాక్షి, నెల్లూరు: ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారి జీవితం విధి ఆడిన వింత నాటకంతో అర్ధాంతరంగా ముగిసింది. నెలన్నర క్రితం భర్త గుండెపోటుతో మృతిచెందాడు. తీవ్ర మనోవేదనకు గురైన భార్య గురువారం తనువు చాలించింది. ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం నెల్లూరులోని జెడ్పీకాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) నగరంలోని జీజీహెచ్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ పొదలకూరురోడ్డు జెడ్పీ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమెకు గూడూరు అయ్యవారిపాళేనికి చెందిన జగదీష్‌తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి గతేడాది అక్టోబర్‌ 29వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు.  

భర్త మృతితో.. 
డిసెంబర్‌లో జగదీష్‌ గుండెపోటుతో మృతిచెందాడు. భర్త హఠాన్మరణం చెందడం, కుటుంబసభ్యులు దూరంగా ఉండడంతో శిరీష తీవ్రమనోవేదనకు గురైంది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల ఆరో తేదీన శిరీష తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 7వ తేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆమెను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ ఘటనపై స్నేహితులు మృతురాలి కుటుంబసభ్యులకు, దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (ఆస్తి కోసం అమానుషం: నిన్న తండ్రి, నేడు కొడుకు..)

మృతదేహాన్ని దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ, ఎస్సై విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. మృతురాలు ఎడమ, కుడి చేతుల మీద ఇంజెక్షన్లు చేసుకున్న ఆనవాళ్లను గుర్తించారు. కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. భర్త మృతిచెందిన కొద్దిరోజులకే శిరీష మృతిచెందడంతో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు