ఇంటి దొంగలను పట్టుకున్న పోలీసులు

19 Aug, 2020 12:38 IST|Sakshi
చోరీపై వివరాలు తెలుసుకుంటున్న సీఐ వైవీ సోమయ్య

బంగారు ఆభరణాలు, నగదు అపహరణ 

గంటల వ్యవధిలోనే ఛేదించిన వైనం 

ఆత్మకూరు: పట్టణంలోని తూర్పువీధిలో అలఘనాథస్వామి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఆత్మకూరు పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు ఆత్మకూరులోని తూర్పువీధికి చెందిన షేక్‌ ఖమ్రూన్‌ జాన్‌ ఇంట్లో 6 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.3 వేల నగదు చోరీకి గురైనట్లు మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఐ వైవీ సోమయ్య, ఎస్సై రవినాయక్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంటికి తాళాలు వేసి ఉండగా చోరీ జరగడంతో వారు అనుమానించి ఇది ఇంటి దొంగల పనేనని భావించారు. ఖమ్రూన్‌ జాన్‌ సోదరుడి కుమారుడి వివాహం ఆదివారం జరగడంతో పలువురు బంధువులు వివాహానికి వచ్చి రెండు రోజులపాటు వీరి ఇంట్లో కూడా విశ్రమించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. బాధితురాలి సోదరి నూర్జహాన్‌ దంపతులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా నూర్జహాన్‌ గతంలోనే పలు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసింది.  

మరిన్ని వార్తలు