ఆక్సిజన్‌ అందక ఆరుగురు మృతి

2 May, 2021 04:51 IST|Sakshi
కర్నూలులోని కేఎస్‌ కేర్‌ ఆస్పత్రి

కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రి కేఎస్‌ కేర్‌లో దారుణం

యాజమాన్యం నిర్వహణ వైఫల్యమే ఘటనకు కారణం

ప్రభుత్వ అనుమతులు లేకుండా కోవిడ్‌ రోగులకు చికిత్స 

ఫైర్‌ సేఫ్టీ లేకపోవడంతో అనుమతి నిరాకరించిన అధికారులు

అయినా కోవిడ్‌ రోగులను చేర్చుకున్న ఆస్పత్రి యాజమాన్యం

క్రిమినల్‌ కేసు నమోదు, ఆస్పత్రి ఎండీ అరెస్టు

కర్నూలు (హాస్పిటల్‌): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రి కేఎస్‌ కేర్‌లో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్వహణ వైఫల్యంతో ఆక్సిజన్‌ అందక ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. వీరిలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆర్‌ఎస్‌ పెండేకల్‌కు చెందిన మద్దిలేటి (40), డోన్‌కు చెందిన అనంతయ్య (70), ఎమ్మిగనూరు మండలం నందవరం గ్రామానికి చెందిన హంపమ్మ(65)తోపాటు వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన రఘునాథరెడ్డి(40), కడపకు చెందిన జైనాబీ (53) ఉన్నారు. మరొకరు వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ అందకపోవడమే మరణాలకు కారణమని చెప్పలేమని కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

శుక్రవారం రాత్రి మరో ముగ్గురు మృతి!
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న కేఎస్‌ కేర్‌ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు ఆక్సిజన్‌ అందక మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న మిగిలిన రోగుల బంధువులు వారిని హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. తమవారిని కాపాడుకునేందుకు ప్రైవేటుగా ఆక్సిజన్‌ సిలిండర్లు తెచ్చి.. వారికి అమర్చి కాపాడుకునే ప్రయత్నం చేశారు. 

అనుమతులు లేకుండానే..
కోవిడ్‌ రోగులకు చికిత్స చేయడానికి కేఎస్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నా.. ఫైర్‌ సేఫ్టీ లేదని అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్‌ రోగులను చేర్చుకుని రెండు వారాలుగా చికిత్స అందిస్తోంది.

యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు
అనుమతి లేకుండా కోవిడ్‌ వైద్యం అందించిన కేఎస్‌ కేర్‌ ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, ఎండీ డాక్టర్‌ లాల్‌బహుదూర్‌ శాస్త్రిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తెలిపారు. కలెక్టర్‌ వీరపాండియన్‌తో కలిసి ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రిపై అధికారుల దాడులు
గుంటూరు రూరల్‌: అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స చేస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు రూరల్‌ మండలం పెదపలకలూరులోని ప్రవీణ్‌ ఆస్పత్రి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆస్పత్రికి ఒక వలంటీరును పంపి కోవిడ్‌ పరీక్ష చేయించారు. దీనికి ఆస్పత్రిలోని ల్యాబ్‌ అసిస్టెంట్‌ రూ.3,500 వసూలు చేశాడు.

పరీక్ష రసీదును తీసుకున్న వలంటీర్‌ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆస్పత్రిలో 12 మంది కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తుండటాన్ని గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి వద్ద కోవిడ్‌ పరీక్షకు రూ.3,500, రోజుకు ఒక బెడ్‌కు రూ.30 వేలు, ఇతర ఇంజక్షన్లు, చికిత్స నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం అధికారుల దృష్టికొచ్చింది. దీంతో డాక్టర్‌ ప్రవీణ్‌తోపాటు మరో వైద్యుడిపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి రికార్డులను సీజ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు