సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి బొమ్మ ధ్వంసం అవాస్తవం

7 Jan, 2021 06:10 IST|Sakshi
సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ముఖద్వారం

తప్పుడు ప్రచారం చేసిన ఐదుగురు మీడియా ప్రతినిధులు సహా ఆరుగురి అరెస్ట్‌ 

మరికొందరిపై కేసుల నమోదు

పాతవి కావడంతో ఇదివరకే పెచ్చులూడిన స్వామి, అమ్మవారి బొమ్మలు

ఈ విషయం తెలిసి కూడా ఓ వర్గం

మీడియాలో విస్తృతంగా ప్రచారం

ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంపై ఉన్న స్వామి, అమ్మవారి బొమ్మలు ధ్వంసం చేశారనేది అవాస్తవమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మీడియా ప్రతినిధులు సహా ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ బి.రవిచంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ బొమ్మలను ఎవరో ధ్వంసం చేశారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కుట్ర పూరితంగా ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలో కూడా ఈ మేరకు వార్త ప్రసారమైంది. అయితే వాస్తవం ఇందుకు విరుద్దంగా ఉంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్‌ ఆర్చిపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి బొమ్మలను సిమెంట్‌తో ఏర్పాటు చేశారు. అవి పాతబడటంతో అప్పుడప్పుడు పెచ్చులూడిపోతుండేవి. ఏటా మరమ్మతులు చేసి రంగులు వేసేవారు. రెండేళ్లుగా ఈ ఆర్చి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో అమ్మవారి బొమ్మ కుడి చేయి విరిగిపోయింది. స్వామి వారి బొమ్మకు పెచ్చులూడాయి. నవంబర్‌ 10న టీవీ9లో ప్రసారమైన డాక్యుమెంటరీలో సిమెంట్‌తో చేసిన దేవుని విగ్రహాలకు పెచ్చులు ఊడి ఉన్నాయని ప్రసారమైంది. అయితే ఈ విషయం ఇతర మీడియా ప్రతినిధులందరికీ తెలిసి కూడా తప్పుడు ప్రసారం చేసి, తప్పుడు వార్తలు రాసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని పోలీసులు నిగ్గు తేల్చారు. ఆలయ ఈవో భైరాగి కూడా తన ఫిర్యాదులో ఇదే విషయం చెప్పారు.

నిందితుల అరెస్ట్‌ 
► అంబటి శివకుమార్‌ (బహుజన మీడియా), సాగి శ్రీనివాసరావు (ధర్మవ్యూహం న్యూస్‌ పేపర్‌), పోకూరి కిరణ్‌ (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి), షేక్‌ భాషా (ఎన్‌టీవి రిపోర్టర్‌), కాట్రగడ్డ రామమోహన్‌ (హెచ్‌ఎం టీవీ రిపోర్టర్‌), మద్దసాని మౌలాలి (లారీ డ్రైవర్‌)లను అరెస్ట్‌ చేశారు.  
► ఏబీఎన్, టీవీ 5, ఈటీవీ ప్రతినిధులు, యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించిన మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరందరిపై 120బి (కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం), 153ఎ (రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం), 295ఎ (మత విద్వేషాలను రెచ్చ
గొట్టేల వ్యవహరించడం), 504 (ప్రజాశాంతికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు