ఈత సరదాకు ఆరుగురు బలి

17 Nov, 2021 00:59 IST|Sakshi
వెంకటసాయి (ఫైల్‌) కొంగ రాకేశ్‌ (ఫైల్‌) క్రాంతికుమార్‌ (ఫైల్‌) తీగల అజయ్‌ (ఫైల్‌) 

మానేరు వాగులో మునిగి  విద్యార్థులు మృతి

లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక దుర్మరణం

ఐదు మృతదేహాల వెలికితీత

ఐదుగురు విద్యార్థులు ఒకే బడి, ఒకే వీధి వాళ్లు

సిరిసిల్ల: ఈత సరదా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. దిగిన వారిని దిగినట్లే మానేరు వాగు మింగేసింది. ఈ హృదయ విదారక సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే... 
సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎనిమిది మంది పిల్లలు స్థానిక కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్‌లో 6వ, 8వ, 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం అనంతరం మధ్యాహ్నం నుంచి బడికి సెలవు ఇచ్చారు. దీంతో కొలిపాక గణేశ్, కొంగ రాకేశ్, శ్రీరాము క్రాంతికుమార్, తీగల అజయ్, జడల వెంకటసాయి, కోట అరవింద్, దిడ్డి అఖిల్, వాసాల కల్యాణ్‌లు ఇంటర్‌ ఫస్టియర్‌ చదివే సింగం మనోజ్‌తో కలసి రాజీవ్‌నగర్‌ శివారులో క్రికెట్‌ ఆడారు.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నెహ్రూనగర్‌ మానేరు తీరంలోని చెక్‌డ్యామ్‌ వద్దకు ఈత కొట్టేందుకు సైకిళ్లపై వెళ్లారు. చెక్‌డ్యామ్‌ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించకుండానే లోపలికి దిగారు. వారిలో ఎవరికీ ఈత రాదు. కొలిపాక గణేశ్‌ (14), కొంగ రాకేశ్‌ (12), శ్రీరాము క్రాంతికుమార్‌ (14), తీగల అజయ్‌ (14), జడల వెంకటసాయి (15), సింగం మనోజ్‌ (16) ఇలా.. దిగినవారు దిగినట్టే నీటిలో మునిగిపోతూ కాపాడాలని కేకలు వేశారు.

భయపడిన మిగిలిన విద్యార్థులు కోట అరవింద్‌ (14), దిడ్డి అఖిల్‌ (13), వాసాల కల్యాణ్‌ (15)లు ఇళ్లకు పరుగుపరుగున వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో అందరూ కలిసి మానేరుకు చేరుకుని గాలింపు చేపట్టి సోమవారం సాయంత్రానికి కొలిపాక గణేశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ టీమ్‌ సభ్యులు మంగళవారం ఉదయం వాగులో గాలింపు ముమ్మరం చేయగా వెంకటసాయి, రాకేశ్, క్రాంతికుమార్, అజయ్‌ శవాలు బయటపడ్డాయి. మనోజ్‌ మృతదేహం కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఘటనాస్థలిని జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి సందర్శించారు.

మంగళవారం సాయంత్రం నాలుగు మృతదేహాలను ఒకే ప్రాంతంలో ఖననం చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో మానేరు తీరం దద్దరిల్లింది. బడికి సెలవు ఇవ్వకపోయినా పిల్లలు బడిలోనే ఉండేవారని బాధితుల బంధువులు వాపోయారు. కాగా, మృతిచెందిన ఆరుగురిలో గణేశ్, వెంకటసాయి, మనోజ్, క్రాంతికుమార్‌ కిందటి నెల జరిగిన వెంకన్న జాతరలో కల్యాణ్, అరవింద్‌లతో సెల్ఫీ దిగారు. ఆప్తమిత్రులతో అదే చివరి ఫొటో అయిందంటూ మిగిలిన మిత్రులు వాపోతున్నారు. 

కేటీఆర్‌ సంతాపం.. 
విద్యార్థులు జలసమాధి కావడంపై మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రభుత్వపరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రాజెక్టు వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఘటనపై సంతాపం తెలిపారు. 

ఈ పాపం ఎవరిది? 
సిరిసిల్ల నెహ్రూనగర్‌ వద్ద ప్రభుత్వం ఈ ఏడాదే రూ. 12 కోట్లతో మానేరు వాగులో 600 మీటర్ల మేర చెక్‌డ్యామ్‌ నిర్మించింది. అయితే నాణ్యతా లోపం, కాంట్రాక్టర్ల ధనదాహానికి తోడు ఇటీవలి వర్షాలు, వరదలకు చెక్‌డ్యామ్‌ తెగిపోయింది. ఆ ప్రదేశం మీదుగానే వరద ప్రవహిస్తోంది. దీంతో వాగుకు కుడివైపు నుంచే ఎక్కువ వరద వెళ్లడం.. అక్కడి నుంచే కొందరు అక్రమార్కులు ఇసుకను తోడేయడంతో భారీ గోతులు ఏర్పడి పిల్లలు నీటి లోతును గుర్తించక అందులో ఈతకు వెళ్లి బలయ్యారు. 

మరిన్ని వార్తలు