విశాఖలో బాలుడి కిడ్నాప్‌..

2 Nov, 2020 03:25 IST|Sakshi
మయాంక్‌ కుమార్‌

గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు 

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): విశాఖలో పారిశ్రామిక ప్రాంతం ఆటోనగర్‌లో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్‌ను కొన్ని గంటల వ్యవధిలోనే గాజువాక పోలీసులు ఛేదించారు. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన నరేష్కుమార్‌ ఆటోనగర్‌ బి–బ్లాక్‌లోని సెయిల్‌ కంపెనీలో బ్రాంచ్‌ మేనేజర్‌. ఆయన భార్య, కుమారుడు మయాంక్‌కుమార్‌(4)తో కలిసి ఆటోనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నాడు. పరిశ్రమలకు మెటీరియల్‌ సరఫరా చేసే ప్రదీప్‌బిశ్వాల్‌తో వ్యాపార లావాదేవీల కారణంగా నరేష్కుమార్‌ రూ.40 లక్షలు బాకీ పడ్డాడు.

ఆదివారం ఉదయం బిశ్వాల్‌ తన భార్య, కుమారుడితో కలిసి రావలసిన సొమ్ము అడిగేందుకు సరేష్‌కుమార్‌ ఇంటికి అద్దె కారులో వచ్చారు. తర్వాత అదే కారులో బిశ్వాల్‌ తన కుమారుడితో పాటు నరేష్కుమార్‌ కుమారుడు మయాంక్‌కుమార్‌ను కూడా ఎక్కించుకుని వెళ్లిపోయాడు. తన కుమారుడు కిడ్నాప్‌నకు గురయ్యాడని నరేష్కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కొన్ని గంటల్లోనే బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు