కాసుబాబు ప్రేమించిన అమ్మాయితో రవి వాట్సాప్‌ చాట్‌.. మద్యం మత్తులో

10 Jun, 2022 08:11 IST|Sakshi
హతుడు పాలెపు కాసుబాబు (పాతచిత్రం)

కాకినాడ సిటీ: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఓ చిన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలెపు కాసుబాబు (26), రవి కాసు, విఘ్నేష్, సతీష్‌లది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం. ఈ నలుగురూ ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. కాకినాడ శాంతినగర్‌లోని మదర్‌ థెరిసా విగ్రహం సమీపాన ఆరు నెలల క్రితం ‘స్టోరీస్‌’ అనే పేరుతో స్టూడియో పెట్టారు.

జగన్నాథపురం మహిళా కళాశాల సమీపాన రూము తీసుకొని నలుగురూ అద్దెకు ఉంటున్నారు. నలుగురూ కలిసి మద్యం తాగేందుకు విఘ్నేష్‌ స్థానిక ఎస్‌ఆర్‌ గ్రాండ్‌ హోటల్‌లో 306 నంబర్‌ రూమును బుధవారం రాత్రి బుక్‌ చేశాడు. అక్కడ కాసుబాబు, రవి కాసు, విఘ్నేష్, సతీష్‌తో పాటు రామకృష్ణ, బిర్లా అనే మరో ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో రవి కాసు చెంపపై కాసుబాబు సరదాగా కొట్టాడు. ఆ తరువాత సరదాగా కొట్టానని క్షమాపణ చెప్పాడు.

అయితే కాసుబాబు తనను కొట్టిన విషయాన్ని రవి కాసు వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పోస్టు చేశాడు. విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు నటించి, మద్యం తాగిన అనంతరం రామకృష్ణ, బిర్లాను తీసుకొని రాత్రి 12 గంటల సమయంలో రవి కాసు బయటకు వెళ్లిపోయాడు. కాసుబాబు, సతీష్‌ హోటల్‌ రూములోనే ఉండిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రవి కాసు తిరిగి హోటల్‌ రూముకు వచ్చాడు. తనను కొట్టి అవమానించినట్టు భావించిన అతడు రూముకు వచ్చిన వెంటనే బీరు బాటిల్‌తో కాసుబాబు తలపై బలంగా కొట్టాడు. అనంతరం పగిలిన గాజుసీసా ముక్కతో కాసుబాబు కంఠంలో పొడిచాడు.

చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..)

ఈ హడావుడితో సతీష్‌ నిద్ర లేచాడు. అడ్డం వస్తే అతడిని కూడా చంపేస్తామని రవి కాసు బెదిరించాడు. దీంతో అతడు ప్రాణభయంతో పారిపోయాడు. రవి కాసు చేసిన దాడిలో కాసుబాబు అక్కడికక్కడే చనిపోయాడు. హత్య అనంతరం రవి కాసు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. హతుడు కాసుబాబు సోదరుడు ధనవర్మ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై టూటౌన్‌ సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాసుబాబు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఉలిక్కిపడిన పల్లం 
కాట్రేనికోన: కాసుబాబు హత్యతో అతడి స్వస్థలం పల్లం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన పాలెపు ధర్మారావు దంపతులకు హతుడు కాసుబాబుతో పాటు కుమార్తె, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్లు కావడంలో స్నేహితుడు కాసుబాబు, మల్లాడి రవి కలిసి కాకినాడలో స్టూడియో నిర్వహిస్తున్నారు. కాసుబాబు ప్రేమించిన అమ్మాయితో రవి వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తుండటంతోనే వారి మధ్య వివాదం తలెత్తి, ఈ హత్యకు దారి తీసిందని పలువురు అంటున్నారు. కాసుబాబు మృతదేహాన్ని చూసేందుకు పల్లం రామాలయం సెంటర్‌కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.  

మరిన్ని వార్తలు