స్మగ్లింగ్‌ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర

23 Jun, 2021 04:11 IST|Sakshi

కాసుల ఎర.. అమాయకుల చెర

నిరుద్యోగులను బలి చేస్తున్న గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠాలు

దుబాయ్, నేపాల్‌ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ యువకులు

  • జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లతో పరిచయమైంది. ‘దుబాయ్‌ నుంచి ఓ పార్శిల్‌ తీసుకురావాలి, విమానం, వీసా ఖర్చులన్నీ మేమే చూసుకుంటం. పార్శిల్‌ తీసుకొచ్చినందుకు రూ.40 వేలు ఇస్తం’ అన్నారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్‌ 2018 ఏప్రిల్‌ 13న దుబాయ్‌ వెళ్లి, 15న అక్కడ ఓ మనిషిని కలిశాడు. ఆయన ఇచ్చిన పార్శిల్‌ తీసుకుని నేపాల్‌ మీదుగా వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆ పార్శిల్‌లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్‌లో ఏముందో తెలియని సర్ఫరాజ్‌ మూడేళ్లుగా నేపాల్‌ జైల్లో మగ్గుతున్నాడు. సర్ఫరాజ్‌ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్‌ భార్య అఫ్రిన్‌ బేగం మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటోంది.
  • ఒక్క సర్ఫరాజ్‌ మాత్రమేకాదు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో ఒకరు, కోరుట్లలో ఒకరు, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మరొకరు బంగారం స్మగ్లింగ్‌ ముఠా కారణంగా నేపాల్‌ జైల్లో మగ్గుతున్నారు. ఈ ముఠాలు వేల రూపాయలు ఎరగా వేస్తూ వీరిని ఉచ్చులోకి దించుతున్నాయి. కొందరు ఎయిర్‌పోర్టులో అధికారుల కళ్లుగప్పి బయట పడుతుండగా, మరికొందరు కస్టమ్స్‌కు చిక్కి జైలుపాలవుతున్నారు.

కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్‌ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్‌ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్‌ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్‌ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్‌ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్‌ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్‌ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు.

కిలోకు రూ.5 లక్షలు తేడా..
మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.  

>
మరిన్ని వార్తలు