‘పుష్ప’ను మించిపోతున్న ఎర్ర స్మగ్లర్లు! 

27 May, 2022 05:22 IST|Sakshi
సీజ్‌చేసిన ఎర్రచందనం.. నిందితుల అరెస్టు చూపుతున్న చిత్తూరు ఎస్పీ తదితరులు

అంబులెన్స్‌లలో ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్‌ 

రోగికి సహాయకుల వలే వేషం 

నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోల్లోనూ స్మగ్లింగ్‌ 

చిత్తూరులో 15 మంది అరెస్ట్‌   

చిత్తూరు అర్బన్‌: ఎర్ర స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ఎర్రచందనం దుంగలను అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. అయితే పోలీసులు కూడా డేగ కళ్లతో అలాంటి వారి ఆటలను కట్టిపెడుతున్నారు. తాజాగా అంబులెన్స్‌లో రోగిని ఎక్కించుకుని వెళుతున్నట్టు నటిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా, నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటో ముసుగులో ఎర్ర దుంగలను స్మగ్లింగ్‌ చేస్తున్న మరో ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.

చిత్తూరు ఆర్ముడ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో గురువారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు మీడియాకు వివరాలు వెల్లడించారు. చిత్తూరు మీదుగా తమిళనాడులోని వేలూరుకు పలు అంబులెన్స్‌లు రోజూ పదుల సంఖ్యలో వెళుతుంటాయి. వాటిలో రోగులను తీసుకెళుతున్నట్టుగా డ్రామాలాడుతూ రోగి సహాయకుల వేషంలో స్మగ్లర్లు రోజూ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య, ఎస్‌ఐ రామకృష్ణలు సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం చిత్తూరు–వేలూరు రోడ్డులోని మాపాక్షి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అటుగా వస్తున్న అంబులెన్స్‌నూ తనిఖీ చేసేందుకు నిలిపారు. అందులో 15 మంది ఉండగా.. తనిఖీచేస్తుండగా నలుగురు పారిపోయారు. మిగిలిన వాళ్లను కిందకి దింపి వాహనాన్ని తనిఖీ చేయగా.. 36 ఎర్రచందనం దుంగలు, చెట్లను నరికే గొడ్డళ్లు, కత్తులు దొరికాయి. తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన శివాజీ, కాశి, దేవరాజ్, రాధాకృష్ణ, సెల్వం, కుప్పుస్వామి, ప్రశాంత్, జయపాల్, ఉదయ్‌కుమార్, సత్యరాజ్, భాగ్యరాజ్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులపై పలు పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికే కేసులున్నట్టు ఎస్పీ తెలిపారు. 

అంబులెన్సులో దాచిన ఎర్రచందనం దుంగలు  

నీళ్ల క్యాన్ల కింద ఎర్ర చందనం  
చిత్తూరు నగరం చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై పశ్చిమ సీఐ శ్రీనివాసులురెడ్డి, గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌లు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోను తనిఖీ చేయగా 35 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో తమిళనాడు చెన్నైకు చెందిన లక్ష్మీపతి, సామువేలు, ప్రవీణ్‌కుమార్,  ముత్తురాజ్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ కేసుల్లో మరికొందర్ని అరెస్ట్‌చేయాల్సి ఉందన్నారు.    

మరిన్ని వార్తలు