‘ఆమెది భరించలేని మోసం.. గుండెలోతుల్లో ఆ బాధను అనుభవించా!’

20 May, 2023 17:00 IST|Sakshi

సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్‌ సింగ్‌ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు.

గురువారం(మే 18) గ్రేటర్‌ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్‌ నాడార్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్‌ సింగ్‌ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్‌ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్‌ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్‌ జీమెయిల్‌ అకౌంట్‌ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. 

వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్‌. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.  ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని.  నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. 

ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్‌ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్‌ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా..

స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు  ఉన్నాయని అనుజ్‌ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్‌ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్‌ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్‌ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్‌ ఛాటింగ్‌ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని..  మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్‌ మాట్లాడాడు. 

మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్‌ సింగ్‌. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్‌ హాల్‌ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్‌. ఆపై హస్టల్‌ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్‌ అయ్యింది కూడా.

గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు