Software Employee Suicide: నాన్నా నన్ను క్షమించు... చాలా సార్లు ఇబ్బంది పెట్టాను!

3 Feb, 2022 13:03 IST|Sakshi

అనంతపురం: ‘నాన్నా నన్ను క్షమించు... నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను’ అంటూ ఆత్మహత్యకు ముందు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లేఖ రాశారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆకుతోటపల్లిలో బుధవారం ఉదయం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన సోదినపల్లి సూర్యనారాయణ కుమారుడు సాయికృష్ణ..  బెంగళూర్‌లోని కాగ్నిజెంట్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

కోవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం కావడంతో ఆకుతోటపల్లిలో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ విధులు నిర్వర్తిస్తుండేవారు. బుధవారం ఉదయం గదిలో ఎవరూ లేని సమయంలోపైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయికృష్ణ అన్న రాజేష్‌ ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌ యాదవ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ఒత్తిళ్లే తన సోదరుడి ఆత్మహత్యకు కారణమంటూ ఈ సందర్భంగా సాయికృష్ణ కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా, ఆత్మహత్యకు ముందు సాయికృష్ణ లేఖ రాసిపెట్టారు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకే బతుకు మీద ఆసక్తి లేదని పేర్కొన్నారు. తనను క్షమించాలని కుటుంబసభ్యులను పేరుపేరునా కోరారు. తనకు కొన్ని అప్పులు ఉన్నాయని, వాటిని సెటిల్‌ చేయాలంటూ తన అన్నను అభ్యర్థించారు. 

మరిన్ని వార్తలు