వారం క్రితం మిస్సింగ్‌ కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

28 Jul, 2022 15:51 IST|Sakshi

చిత్తూరు : చిన్నగొట్టిగల్లు మండలం తిప్పిరెడ్డిగారిపల్లె పంచాయతీ అడ్డగుట్ట గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భాకరాపేట ఎస్‌ఐ ప్రకాష్‌ కుమార్‌ కథనం మేరకు.. తిప్పిరెడ్డిగారిపల్లెలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పశువుల కాపరులు బుధవారం సాయంత్రం సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్‌ ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు.

మృతుడు అన్నమయ్య జిల్లా కలకడ మండలం పోతువారిపల్లె గ్రామానికి చెందిన ఇందుల గణేష్‌ (28)గా గుర్తించామన్నారు. తిరుపతి వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో వారం క్రితం మిస్సింగ్‌ కేసు నమోదై ఉన్నట్లు చెప్పారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

మరిన్ని వార్తలు