ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

10 Oct, 2021 07:59 IST|Sakshi

చిత్తూరు జిల్లాలో టెక్కీల కారు ప్రమాదం  

యువతి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు  

బాధితులు బెంగళూరులో ఉద్యోగులు

సాక్షి, వాల్మీకిపురం (చిత్తూరు జిల్లా): తిరుమలకు వెళ్తున్న ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకరు అక్కడికక్కడే మరణించారు. శనివారం ఉదయం ఈ సంఘటన వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మదనపల్లె రూరల్‌ మండలం అడ్డగింటివారిపల్లెకు చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి (25), గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ప్రియాంక (24), వైష్ణవి (24), అనూష (24), విజయవాడ వద్ద కొడాలికి చెందిన రమ్య (23), తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్వేత (25) బెంగళూరులోని ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.  

బ్రహ్మోత్సవాలను చూద్దామని  
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలను సందర్శించడానికి శనివారం ఉదయం వీరంతా ఏపి 09 బిపి 1246 నంబరు గల ఇన్నోవా కారులో బయలుదేరారు. టిఎం వ్యాలీ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే యత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రియాంక అక్కడికక్కడే మరణించింది. వైష్ణవి, అనూష, రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. శ్వేత, కారు నడుపుతున్న కిరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి.  

బెంగళూరుకు తరలింపు..  
ఆ దారిన వెళ్తున్నవారు బాధితులను కారు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌ను పిలిపించారు. శ్వేతను మినహా మిగతావారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వాహనంలో బెంగళూరుకు తరలించినట్లు తెలియవచ్చింది. ప్రియాంక మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆమె కుటుంబ సభ్యులు మదనపల్లెకు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు