ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్‌

4 Mar, 2021 03:39 IST|Sakshi

పెళ్లి విషయం తెలిసి దూరం పెట్టిన యువతి

దాంతో కక్ష పెంచుకున్న ఉన్మాది

మాట్లాడాలని పిలిచి కత్తితో దాడి

మణికొండ: అతడికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో యువతితో ప్రేమ నాటకానికి తెరలేపాడు. అతడిని నమ్మిన యువతి తన మతం, కులం వేరైనా వివాహానికి సిద్ధమైంది. అంతలోనే అతడికి పెళ్లయిన విషయం తెలిసి దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేకపోయిన అతను ఆమెను అంతం చేయాలని పథకం వేసి పోలీసులకు చిక్కాడు. మంగళవారం రాత్రి నార్సింగి ఠాణా పరిధిలోని హైదర్‌షాకోట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. హరియాణా రాష్ట్రానికి చెందిన షారూఖ్‌ సల్మాన్‌ (23) కొన్నేళ్లుగా స్థానికంగా ఉన్న జావెద్‌ హబీబ్‌ సెలూన్‌లో పనిచేస్తున్నాడు. బాధితురాలు పలుమార్లు అదే సెలూన్‌కు వెళ్లడంతో పరిచయం చేసుకున్న అతడు ప్రేమనాటకం మొదలు పెట్టాడు. ఓ దశలో అతడిని వివాహం చేసుకునేందుకు యువతి సిద్ధమైంది.

ఈ క్రమంలో అతనికి గతంలోనే వివాహం అయ్యిందని, భార్యాపిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో యువతి అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో ఏకంగా తనను మట్టుపెట్టాలనే పథకం వేశాడు. మంగళవారం రాత్రి చివరిసారిగా మాట్లాడాలని అపార్ట్‌మెంట్‌ కిందికి రప్పించి ఉన్నట్టుండి తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతి బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు రాగానే షారూఖ్‌  పారిపోయిందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కోర్టు రిమాండ్‌ విధించినట్టు ఎస్సై అన్వేశ్‌రెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు