హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం

3 Mar, 2021 11:01 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై యువకుడి ఘాతుకం 

వీపు, గొంతుపై తీవ్రంగా గాయాలు 

నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు 

మణికొండ:  తనను ప్రేమించడం లేదని కక్ష గట్టిన ఓ యువకుడు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. మాట్లాడుదామంటూ పిలిచి, ఆ యువతి ఉండే అపార్ట్‌మెంట్‌ ఆవరణలోనే చంపేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా అరవడం, చుట్టుపక్కల ఉన్నవాళ్లు రావడంతో పారిపోబోయాడు. కానీ స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌ శివార్లలోని హైదర్షాకోట్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. 

పరిచయాన్ని అడ్డుపెట్టుకుని.. 
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులతో కలిసి హైదర్షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు దగ్గర్లోని జావెద్‌ హబీబ్‌ సెలూన్‌లో పనిచేస్తున్న షారూఖ్‌తో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. షారూఖ్‌ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే యువతికి ఈ ఏడా ది మేలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పా ట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న షారూఖ్‌.. తనతోనే ఉండాలంటూ ఆ యువతిపై ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.

మంగళవారం ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి మాట్లాడాలంటూ ఆ యువతిని కిందికి పిలిచాడు. ఆమె రాగానే కత్తితో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఆమెకు వీపు, పొట్ట, గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో ఆమె గట్టిగా అరవడంతో యువతి తల్లి తండ్రి కిందికొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. షారూఖ్‌ వారిపైనా దాడికి యత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగి సీఐ తెలిపారు. 

చదవండి: దారుణం: తల చెరువులో.. మొండెం చెట్ల పొదల్లో

సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు