కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్‌ రిపోర్టు

28 Aug, 2020 13:21 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ శుక్రవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. రాంపల్లి దాయర వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు రిపోర్టులో తేలింది. ఇందులో భాగంగానే తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్‌ను  అంజిరెడ్డి కుదిర్చినట్లు తేలింది. నాగరాజుకు అందజేసిన డబ్బు శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సమకూర్చినట్లు బయటపడింది. దీంతోపక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ.. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేసింది.

అయితే నాగరాజుతో డీల్‌కు సంబంధించి అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో సమావేశమైనట్లు తెలిసింది. ఏసీబీ దాడి సమయంలో అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిని మొత్తం సెర్చ్‌ చేసిన ఏసీబీ.. ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 65 పేజీల  రెప్రజెంటేటివ్ లెటర్స్ను కూడా స్వాధీనం చేసుకుంది.గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించి ఇళ్ళ అనుమతికి 204 పేజీల పత్రాలతో పాటు,  రాంపల్లి దాయర భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలు, పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలతో పాటు 65 పత్రాలు స్వాధీనం చేసుకుంది. (చదవండి : కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!)

ఈ అంశాలపైనే మూడు రోజుల పాటు విచారించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో నిందితులెవరు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. దీంతో నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో నాగరాజుతో పాటు మిగతా నిందితులు ఏసీబీ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు