తుపాకులా.. పప్పుబెల్లాలా?! 

18 Nov, 2021 03:53 IST|Sakshi

‘ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌’లో భద్రపరిచిన ఆయుధాలను పంచేసుకున్న పోలీసులు   

మొక్కుబడి వేలం పాట.. ఖజానాకు రూ.70 లక్షల వరకూ కన్నం 

తూర్పుగోదావరి జిల్లాలో కొందరు పోలీసు అధికారుల బాగోతం   

నిజాలు నిగ్గుదేల్చేందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 

సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలీస్‌ కార్యాలయంలో దాచిన ఆయుధాలను పట్టుకుపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 582 పైచిలుకు ఆయుధాలను పంచేసుకున్నారు. ఈ పనిచేసింది ఎవరో దొంగలు కాదు.. ఏకంగా పోలీసులే. పోలీస్‌ అధికారులు స్థాయిని బట్టి ఇది నీకు.. అది నాకు.. అన్నట్టుగా తలా ఒకటి తీసేసుకున్నారు.  విషయం బయటపడకుండా అంతా పక్కాగా టెండర్లు పిలిచినట్టు ఓ నాటకానికి తెరతీసి రక్తి కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1969 నుంచి జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్‌ కార్యాలయం ఆర్మర్డ్‌ రిజర్వులో భద్రపరిచిన 582 ఆయుధాలను నామ్‌కే వాస్తేగా వేలం వేసి పోలీస్‌ అధికారులు పంచేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, అలాగే లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తుపాకులను తీసుకెళ్లకపోవడం.. వంటి వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వులో భద్రపరుస్తారు. డీజీ అనుమతితో వాటిని వేలం వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలంటే.. డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. డీజీ కార్యాలయం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలి. అనంతరం వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవన్నీ జరిగాక సీల్డ్‌ కమ్‌ ఓపెన్‌ టెండర్లు పిలవాలి. ఆయుధాలు ఎన్ని వేలం వేస్తున్నారు.. వాటి ఖరీదు ఎంత.. అనేది నిర్ధారించాక, నిర్దేశించిన తేదీన వేలం వేయాలి. అలాగే వేలంలో అత్యధికంగా కోడ్‌ చేసిన ఆయుధాలు కొనుగోలు, విక్రయ లైసెన్స్‌ కలిగిన వారి టెండర్‌ను ఖరారు చేయాలి. ఆ వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. 

నిబంధనలకు పాతర 
నిబంధనలన్నింటికీ పోలీసులు పాతశారు. లైసెన్స్‌ ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారు. 17 చలానాలు తీయించి నామ్‌కే వాస్తేగా టెండర్లు వేయించారు. హైదరాబాద్‌ అబిడ్స్‌కు చెందిన రాజధాని ఆరŠమ్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ అఫ్జల్‌ పేరుతో 2021 ఏప్రిల్లో టెండర్‌ ఖరారు చేశారు. టెండర్లో రూ.8 లక్షలు వచ్చినట్టుగా రికార్డు చేసి ఖజానాలో జమ చేశారు. అసలు టెండర్లు పిలవకుండానే, ఆయుధాలకు ధర నిర్ణయించకుండానే రూ.8 లక్షలకు ఖరారు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఖజానాకు కన్నం వేశారు.

ఇందులో అప్పటి పోలీస్‌ అధికారులు చక్రం తిప్పి ఆయుధాలను సొంతం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసులు పంచేసుకున్న వాటిలో ఫిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్‌బీబీఎల్‌(సింగిల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌), డీబీబీఎల్‌ (డబుల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌) తుపాకులు, కార్బన్‌.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి. వీటిలో రష్యా, బ్రెజిల్, బెల్జియం, యూఎస్‌ దేశాల్లో తయారైన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలానే ఉన్నాయి. రూ.ఆరు లక్షలు, రూ.ఏడు లక్షల విలువైన ఆయుధాలూ కొన్ని ఉన్నాయి. అఫ్జల్‌తో మాట్లాడుకుని ఇవన్నీ కలిపి వేలం వేస్తున్నట్టు రికార్డులు సృష్టించి.. ఒక పోలీస్‌ అధికారి, స్పెషల్‌ బ్రాంచ్‌కు చెందిన ఓ డీఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్‌.. ఇలా వివిధ స్థాయిల్లో పోలీసులు తమకు నచ్చినవి ఎత్తుకెళ్లిపోయారు.   

ఆ ఫిర్యాదుతో వెలుగులోకి..  
గన్‌ లైసెన్సు రెన్యువల్‌ కోసం చేసుకున్న దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా తుపాకీ తిరిగి ఇవ్వడం లేదని అనపర్తికి చెందిన రెడ్డి అనే వ్యక్తి ఇటీవల జిల్లా పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. బెల్జియానికి చెందిన అత్యంత ఖరీదైన తుపాకీ కోసం అతను పదే పదే అడగడంతో ప్రస్తుత జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆరా తీస్తే.. ఈ ఆయుధాల కుంభకోణం బయటపడింది. వాస్తవంగా ఆయుధాలకు వేలం వేసే ముందు సీజ్‌ చేసిన ఆయుధాలు, లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తుచేసుకున్న వారికి కూడా నోటీసులివ్వాలి. అలా ఎవరికీ నోటీసులిచ్చిన దాఖలాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చే దిశగా కాకినాడ స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కాకినాడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదుతో ఆయుధాల మాయంపై కేసు 
నమోదైంది. 

లోతుగా విచారిస్తున్నాం..  
ఆయుధాల టెండర్ల వ్యవహారం మా దృష్టికొచ్చింది. అన్ని విషయాలనూ లోతుగా విచారిస్తున్నాం. 
– ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ.. తూర్పుగోదావరి జిల్లా   

మరిన్ని వార్తలు