భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే

8 Jun, 2021 07:06 IST|Sakshi
ఇంతియాజ్‌ (ఫైల్‌)

భాగ్యనగర్‌కాలనీ: తన భార్యను దూషించడాన్ని తట్టుకోలేని కుమారుడు కన్న తండ్రిని చంపిన ఘటన సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సఫ్దార్‌నగర్‌లో ఎం.డి. ఇంతియాజ్‌ (55), ఆయన  ఇద్దరు కుమారులు సలావుద్దీన్, బురానుద్దీన్‌ ఒకే ఇంట్లో వేర్వేరుగా నివాసముంటున్నారు. ఇంతియాజ్‌ గతంలో ఆర్‌ఎంపీగా పని చేసి మానేశాడు.

పదేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదు. కనిపించినవారినల్లా దూషిస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి తన పెద్ద కుమారుడు సలావుద్దీన్‌ భార్యతో  గొడవ పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆవేశానికి లోనైన సలావుద్దీన్‌ గదిలో నిద్రిస్తున్న తండి తలపై సెంట్రింగ్‌ కర్రతో మోదాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.  

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో రూ.1.19 లక్షలు స్వాహా 
హిమాయత్‌నగర్‌: బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఎకౌంట్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలంటూ ఓ లింక్‌ పంపి సైబర్‌ నేరగాడు తనను నిండాముంచినట్లు మాదన్నపేటకు చెందిన మహ్మద్‌ ఉమర్‌ సైబర్‌క్రైం పోలీసులకు సోమవారం ఫిర్యా దు చేశాడు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఎకౌంట్‌కు సంబంధించి మీరు ఇంతవరకు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోలేదన్నాడని, తాము లింక్‌ పంపిస్తాం ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే చాలు మీ కేవైసీ అప్‌డేట్‌ అవుతుందంటూ ‘ఎనీ డెస్క్‌’ అనే యాప్‌నకు సంబంధించిన లింక్‌ను పంపాడు.

ఇది నిజమని నమ్మిన ఉమర్‌ దానిని క్లిక్‌ చేయగా..రూ.44వేలు మాయమయ్యాయి. వెంటనే ఇలా కట్‌ అయ్యాయని ఉమర్‌ ఆ వ్యక్తికి ఫోన్‌లో చెప్పగా..మరో ఎకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వండి దానికి లింక్‌ పంపిస్తాం క్లిక్‌ చేయమన్నాడు. ఇది కూడా నిజమేనని భావించి లింక్‌ ఓపెన్‌ చేయడంతో ఈ ఎకౌంట్‌ నుంచి రూ.75వేలు కట్‌ అయ్యా యి. ఇలా రెండు దఫాలుగా రూ.1.19 లక్షలు కట్‌ అవ్వడంతో సైబర్‌ నేరగాడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
చదవండి: ఆరుగురి మృతి: నడివీధిలో కత్తితో నిరుద్యోగి హల్‌చల్‌

మరిన్ని వార్తలు