సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు

13 Jul, 2022 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు.. సేవ చేయాల్సి వస్తుందని కన్నతండ్రినే గొంతు నులిమి హత్య చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ పవన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్‌ విలేజ్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ(75), దుర్గమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కుమారుడు సురేష్‌ ఉన్నారు. కుమార్తెలకు వివాహం కాగా, వృద్ధ దంపతులు కుమారుడు సురేష్‌ వద్ద ఉంటున్నారు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడికి భార్య దుర్గమ్మ సేవలు చేసేది.

ఇటీవల దుర్గమ్మకు సైతం అపరేషన్‌ జరగడంతో సురేష్‌ తండ్రికి సేవ చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్‌ తండ్రికి సేవ చేసే విషయంలో తల్లి దుర్గమ్మతో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన దుర్గమ్మ కుమార్తె ఇంటికి వెళ్లిపోవడంతో ఇంట్లో తండ్రి సత్యనారాయణ, సురేష్‌ మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన సురేష్‌ మంచంపై ఉన్న తండ్రి గొంతు నులిమి హత్య చేసి ఏమీ తెలియనట్లు తన తండ్రి చనిపోయాడని చుట్టు పక్కల వారికి చెప్పాడు.  

స్థానికుల అనుమానంతో వెలుగులోకి.. 
సురేష్‌ మాటలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న  జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మెడపై ఉన్న గాయం ఆధారంగా సురేష్‌ తండ్రిని హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న విచారించగా తానే గొంతు నులిమి హత్య చేసినట్లు సురేష్‌ అంగీకరించాడు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. 
చదవండి: Hyderabad: వాట్సాప్‌లో పరిచయం.. రూ.7 లక్షలు కాజేసిన యువతి

మరిన్ని వార్తలు