కోడలిని వేధించిన పాపం..! 

23 Jun, 2021 10:40 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ, వెనుక నిందితులు

తండ్రిని కడతేర్చిన తనయుడు

నిందితుడితో పాటు

మరో ముగ్గురు అరెస్టు 

గిద్దలూరు: తండ్రిని కడతేర్చిన కుమారుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఎండీ ఫిరోజ్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని దంతెరపల్లెలో ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి మోడి భాస్కర్‌ను హత్య చేసింది అతని కన్న కొడుకు రంగప్రసాద్‌..అని తేలింది. హత్యకు గురైన భాస్కర్‌ కొంతకాలంగా కుమారుడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లడంతో రంగప్రసాద్‌ తండ్రిని పలు మార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. ఆగ్రహించిన కుమారుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికాడు. బలమైన గాయం కావడంతో భాస్కర్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుమారుడు తన తండ్రి కరోనాతో మరణించాడని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

గ్రామంలో పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూదంటూ తన సమీప బంధువుల సహకారంతో రాత్రికి రాత్రి మృతదేహాన్ని దహనం చేసే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దహనం అవుతున్న మృతదేహాన్ని మధ్యలో ఆపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్యగా తేలడంతో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించగా భాస్కర్‌ను ఆయన కుమారుడు రంగప్రసాద్‌ హతమార్చినట్లు తేలింది. రంగప్రసాద్‌తో పాటు మృతదేహాన్ని దహన సంస్కారాలు చేసేందుకు సహకరించిన వెంకటాపురం గ్రామానికి చెందిన మోడి రంగనాథం, రంగస్వామి, ఆదిగంగయ్యలను కె.బయనపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండు విధించారు.

చదవండి: హైవేలో లారీ పార్క్‌ చేస్తే అంతే..!

మరిన్ని వార్తలు