కన్నతం‍డ్రినే హత్య చేసిన కొడుకు 

10 Mar, 2021 08:14 IST|Sakshi

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం

నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కామారెడ్డి క్రైం: ఇటీవల తీసుకున్న బ్యాంకు రుణం డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. కన్నతండ్రి అని చూడకుండా తీవ్రంగా కొట్టి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు ఓ కొడుకు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బూక్య ఫకీరా (50)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఫకీరా భార్య ఘంసీ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. ఫకీరాకు ఆంధ్రాబ్యాంక్‌ నుంచి మూడు రోజుల క్రితం పంటరుణం మంజూరైంది.

డబ్బుల విషయంలో తండ్రికి, అతని కొడుకు భాస్కర్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం డబ్బుల విషయంలో కొడుకు భాస్కర్‌ తండ్రితో గొడవపడ్డాడు. మాట్లాడుకుందామని చెప్పి పక్కనే ఉన్న ఉగ్రవాయి శివారులోకి తీసుకువెళ్లాడు. అక్కడే తండ్రిని కర్రలతో తీవ్రంగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత సమీపంలోని చెట్టుకు టవల్‌తో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. 

చదవండి :  (ప్రేమించి పెళ్లి చేసుకున్నారని హత్యాయత్నం)
(కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!)

మరిన్ని వార్తలు