దారుణం: తండ్రి మరో మహిళతో చనువుగా ఉంటున్నాడని..

17 Jul, 2021 13:51 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రూరల్‌ జిల్లా ఏఎస్పీ మూర్తి, పక్కన డీఎస్పీ విజయభాస్కరరావు, సీఐ అచ్చయ్య. వెనుక ముసుగులు ధరించిన నిందితులు

సాక్షి, నగరంపాలెం(గుంటూరు): తండ్రి మరో మహిళతో చనువుగా ఉంటున్నాడని, ఆస్తి తనకు దక్కడం లేదనే అక్కసుతో ఓ కొడుకు తండ్రి హత్యకు కుట్రపన్నాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి పకడ్బందీగా తండ్రిని అడ్డు తప్పించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. నరసరావు పేట రావిపాడులోని గాయత్రీనగర్‌ వద్ద జరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కోటపాటి మల్లికార్జునరావు హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసు వివరాలను గుంటూరు రూరల్‌ జిల్లా అదనపు ఎస్పీ(క్రైం) ఎన్‌.విఎస్‌.మూర్తి శుక్రవారం గుంటూరు రూరల్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, నరసరావుపేట రూరల్‌ పీఎస్‌ సీఐ అచ్చయ్యతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. నరసరావుపేట టౌన్‌ రామిరెడ్డిపేటకు చెందిన కోటపాటి మల్లికార్జునరావు (56) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఇతని స్వస్థలం ప్రకాశం జిల్లా. జీవనోపాధికై రామిరెడ్డిపేటకు వచ్చాడు. ఏడాది కిందట మోసం చేశాడనే నెపంతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ తడికమళ్ల రమేష్‌ని మల్లికార్జునరావు, అతని కొడుకు సాయికృష్ణ, డ్రైవర్‌ కలిసి హత్య చేశారు. దీనిపై నరసరావుపేట రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం వీరు బెయిల్‌పై ఉన్నారు.  

రూ.20లక్షలకు సుఫారీ  
ఇటీవల కాలంలో మల్లికార్జునరావు ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఆస్తిని ఆమెకు ఖర్చుచేస్తున్నాడని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని కొడుకు సాయి కృష్ణ తండ్రిపై గుర్రుగా ఉన్నాడు. యూకేలో విద్యనభ్యసించిన సాయి సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు. దీనికి తండ్రి అంగీకరించలేదు. పైగా హేళనగా మాట్లాడాడు. అతను బతికి ఉన్నంత వరకూ తనకు ఆస్తి దక్కదనే అక్కసుతో తండ్రి హత్యకు స్నేహితుడు కోట అనిల్‌తో కలిసి కుట్రపన్నాడు.

రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన ఈదర రాజారెడ్డిని సంప్రదించి, రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం రాజారెడ్డి తన అనుచరులైన చినిశెట్టి దుర్గాప్రసాద్, మున్నంగి గోపీ, వేల్పూరి నాగబ్రహ్మచారి, యక్కంటి అంజరెడ్డి, నార్నే శ్రీనులతో చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు. వారు మల్లికార్జునరావు కదలికలపై కొద్ది రోజులు రెక్కీ నిర్వహించారు. ఈనెల 7న గాయత్రీనగర్‌ వెంచర్‌ వద్దకు వెళ్లిన మల్లికార్జునరావును కిరాతకంగా మారణాయుధాలతో హతమార్చారు.   
దర్యాప్తు సాగిందిలా..  
రియల్టర్‌ హత్యకును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కొడుకు సాయికృష్ణపై ఓ కన్నేసి అతని సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించారు.  శుక్రవారం ఉదయం నరసరావుపేట ఇస్సప్పాలెం వద్ద కోటపాటి సాయికృష్ణ అతని స్నేహితునితోపాటు, మిగిలిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 38 ఏళ్ల వయసులోపు వారే. నేరం ఒప్పుకోవడంతో ఏడుగురినీ అరెస్టు చేశారు.

వారివద్ద   మరణాయుధాలు, సెల్‌ఫోన్లు, ఓ ఆటో, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.  హత్య కుట్రలో భాగం పంచుకున్న ఈదర రాజారెడ్డి, సాహిద్‌ నాగూర్‌ పరారీలో ఉన్నారని ఏఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి చెఎప్పారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. పది రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన డీఎస్పీ విజయభాస్కరరావు, సీఐ అచ్చయ్య, ఎస్సైలు ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీహరి, హజరత్తయ్య, ఐటీ కోర్‌ హెచ్‌సీ సాంబశివరావు, కానిస్టేబుళ్లను ఎస్పీ విశాల్‌ గున్ని అభినందించారని, రివార్డులు ప్రకటించారని ఏఎస్పీ వివరించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు