కన్నతల్లిని నమ్మించి.. రూ.12 లక్షలు కాజేసిన కడారి రామకృష్ణ

31 Aug, 2022 02:02 IST|Sakshi

బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు స్వాహా చేసిన కుమారుడు

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గుండు గీయించుకుని తల్లి నిరసన

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

మహబూబాబాద్‌ రూరల్‌: కంటిచూపు మందగించిన కన్నతల్లిని మోసగించి భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. అతడి మోసాన్ని తట్టుకోలేక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గుండు గీయించుకుని ఆ తల్లి నిరసన తెలిపింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన సరోజన తొర్రూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తోంది.

ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు రామకృష్ణ, శ్రీనివాస్‌ అనే ఇద్దరు కుమా రులు, ఒక కుమార్తె ఉండగా, వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇటీవల ప్రమాదవశాత్తు ఆమె కుడికాలు విరగడంతో వైద్యులు ఆపరేషన్‌ చేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఇద్దరు కుమారులు నెలలో 15 రోజుల చొప్పున కొంతకాలం ఆమెకు సేవలు చేశారు. ఈ క్రమంలో మధుమేహ వ్యాధితో బాధ పడుతున్న సరోజనకు కంటిచూపు సరిగా లేకపోవడంతోపాటు తీవ్ర అనారోగ్యం బారినపడింది. ఆస్పత్రికి తీసుకువెళ్తామని నమ్మించి ఇందిరాచౌక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌కు తీసుకెళ్లాడు.

తల్లి ఖాతాలోంచి రూ.12.40 లక్షలను తన ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను కొట్టి కుమారుడు, కోడలు పారిపోయారు. దీనిపై పెద్దకుమారుడిని నిలదీయగా వారంలో మొత్తం తిరిగి ఇస్తానని నమ్మించి భార్య, అత్తను వెంటపెట్టుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు. ప్రస్తుతం తన వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేవని, డబ్బులు అడిగిన ప్రతిసారి తనను కొడుతున్నారని సరోజన కన్నీటిపర్యంతమైంది.

మహబూబాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గుండు గీయించుకొని ఆమె నిరసన తెలిపింది. కొడుకు చేసిన మోసంపై మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి చేసిన ఆరోపణలపై కుమారుడు రామకృష్ణను వివరణ కోరగా తాను మోసం చేయలేదని, శనివారం వచ్చి సమాధానం చెబుతానన్నాడు.

మరిన్ని వార్తలు