తండ్రిని చంపితే రూ.3 లక్షలు..  తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!

30 Oct, 2022 10:32 IST|Sakshi

ఆస్తి కోసం కిరాయి హంతకులతో కుమారుడి ఒప్పందం 

చోరీ కేసులో అరెస్ట్‌ చేసి విచారించగా.. విషయం వెలుగులోకి..

నెల్లూరు జిల్లాలో ఘటన

నెల్లూరు (క్రైమ్‌): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్‌ గౌస్‌బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ షాహూల్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. 

మూడు సార్లు రెక్కీ
కావలి పట్టణం తుఫాన్‌నగర్‌కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్‌ షఫీ ఉల్లాను సంప్రదించాడు.

తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్‌ బాషా, షేక్‌ షాహుల్‌తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్‌ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు.

ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్‌ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి..

మరిన్ని వార్తలు