తల్లిని వేధిస్తున్నందుకు.. తండ్రిని చంపిన తనయుడు 

2 Jun, 2021 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఊర్కొండ (నాగర్‌ కర్నూల్‌): తరచూ తల్లిని వేధిస్తుండటాన్ని తట్టుకోలేక తండ్రిని తనయుడు నరికి చంపిన ఘటన మండలంలోని ఇప్పపహాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇప్పపహాడ్‌కు చెందిన డబ్బా రాములు (52), భార్య రామచంద్రమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. వీరి కుమారులు యాదగిరి, విష్ణు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అయితే మద్యానికి బానిసైన రాములు తాగినప్పుడల్లా భార్యను వేధించడంతోపాటు చితకబాదేవాడు.

మూడురోజుల క్రితం తాగి వచ్చి కొట్టడంతో రామచంద్రమ్మ కుమారులకు సమాచారం అందించింది. వారు గ్రామానికి చేరుకుని తండ్రితో వాగ్వాదానికి దిగి మందలించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పెద్దకుమారుడు యాదగిరి పొలానికి వెళ్లగా.. చిన్న కుమారుడు విష్ణు ఇంటి వద్దే ఉన్నాడు. రాములు భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన చిన్న కుమారుడు విష్ణు గొడ్డలితో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పెద్ద కుమారుడు యాదగిరి, రామచంద్రమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ సైదులు, స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు