కళ్లలో కారంకొట్టి.. వేడిగంజి పోసి

20 Aug, 2021 10:55 IST|Sakshi

 అల్లుడిపై అత్తింటివారి దురాగతం! 

మందస: అల్లుడిపై అత్తింటివారు దురాగాతానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెల్లుపటియా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మందస పోలీసులు వివరాలను  గురువారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన రాపాక వెంకటరమణ విజయనగరం జిల్లా చింతలవలస ఐదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

ఇతనికి ఏడేళ్ల క్రితం మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన కర్రి ఐశ్వర్యతో వివాహమైంది. అల్లుడు, అత్తవారి మధ్య స్వల్ప విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెంకటరమణ అత్తవారిల్లు బెల్లుపటియాకు బుధవారం వచ్చారు. అక్కడ ఏమైందోగాని అత్త కర్రి కాంతమ్మ తనపై మరుగుతున్న గంజినీటిని పోసి.. కళ్లలో కారం కొట్టి హత్యాయత్నం చేయబోయిందని, మామ భైరాగి సహకరించారని బాధితుడు ఆరోపించారు. బాధతోనే పరుగులు తీసిన వెంకటరమణ, భార్య, పిల్లలను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని మందస పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం హరిపురం సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స తీసుకోగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108 వాహనంలో శ్రీకాకుళంలో కిమ్స్‌లో చేరి.. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు