కొడుకు కిరాతకం

2 Aug, 2020 07:55 IST|Sakshi

మండ్యలో తల్లిని చంపిన డిగ్రీ విద్యార్థి

మొబైల్‌ వ్యసనం వద్దు అన్నందుకు దారుణం   

మండ్య: మొబైల్‌ ఫోన్‌ వ్యసనం ఓ యువకున్ని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్‌ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. గత గురువారం మండ్యలోని విద్యా నగరలో ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు.  

విచారణలో నేరం రట్టు
ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు.  

ఏం జరిగిందంటే  
మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అయిన మను శర్మ బీఎస్సి చివరి ఏడాది చదువుతున్నాడు. ఇతను ఎప్పుడూ మొబైల్‌ఫోన్‌లో లీనమయ్యేవాడు. యువతితో కూడా ఫోన్‌లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బటయకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. తరువాత తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి అతని తలపైన గట్టిగా కొట్టడంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు