ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన తనయులు

26 Sep, 2020 11:36 IST|Sakshi
మృతి చెందిన తూమాటి సుబ్బారావు

ధనకాంక్ష పేగుబంధంపై దాడి చేసింది. ప్రేమగా పిలిచే గొంతును సైతం కాలికింద పెట్టి తొక్కేసింది. సన్మార్గంలో నడిపించిన తండ్రిని దుర్మార్గంగా బలి తీసుకుంది. బతుకుదెరువు నేర్పిన నాన్నకు బతుకే లేకుండా చేసింది. జన్మనిచ్చిన పాపానికి మృత్యువులోకి నెట్టేసింది. ముదిమి వయసులో ఓ ముద్ద పెట్టాల్సింది పోయి ఊపిరి తీసేసింది.

గరికపాడు(తాడికొండ): మానవత్వాన్ని మంటగలుపుతూ ఆస్తి కోసం కన్న తండ్రినే కర్కశంగా దాడిచేసి దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో జరిగింది. ముదిమి వయసులో జన్మనిచ్చిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారులే కర్కోటకులుగా మారి సభ్య సమాజం తలదించుకొనేలా 70 సంవత్సరాల వృద్ధుడిని కర్రతో దాడిచేసి కాలితో గొంతుపై తొక్కి చంపడం అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరికపాడు గ్రామానికి చెందిన తూమాటి సుబ్బారావుకు నలుగురు కుమారులు ఉన్నారు. (చదవండి: వాగులో ఒరిగిన ఆర్టీసీ బస్సు..)

మొదటి కుమారుడు తూమాటి బ్రహ్మయ్య చనిపోయాడు. సుబ్బారావు తన రెండో కుమారుడు తూమాటి ఆదెయ్య వద్ద నివసిస్తుండగా ఆస్తి పంపకాల వ్యవహారంలో వివాదం చెలరేగింది. తనకున్న 10 ఎకరాల పొలంలో నలుగురు కుమారులకు గతంలోనే ఒక్కో ఎకరం చొప్పున పంచగా, మిగిలిన 6 ఎకరాలను సమానంగా పంపిణీ చేసి మిగిలి ఉన్న ఇంటిని తన పోషణ చూసుకుంటున్న రెండో కుమారుడు ఆదెయ్యకు రాసిస్తానని చెప్పడం వివాదంగా మారింది. దీనికి ఒప్పుకోని మూడో కుమారుడు వెంకటేశ్వరరావు, నాలుగో కుమారుడు తూమాటి గోవిందయ్య శుక్రవారం మధ్యాహ్నం తండ్రిపై కర్రతో దాడిచేయడంతో పాటు గొంతుపై కాలువేసి తొక్కడంతో కోమాలోకి వెళ్ళాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తూమాటి ఆదెయ్య భార్య ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు. (చదవండి: పోయినా... పొందండి ఇలా..!)

మరిన్ని వార్తలు