రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు

19 Sep, 2021 04:25 IST|Sakshi

సోనూసూద్, భాగస్వాములపై ఐటీ శాఖ ఆరోపణ

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్, ఆయన భాగస్వాములు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా పన్నుని ఎగవేసినట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా ముంబైలోని సోనూసూద్‌ నివాసం, కార్యాలయాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన భాగస్వాముల కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఐటీ శాఖ ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించింది. 20 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించామని శనివారం ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఐటీ శాఖ వివరాల ప్రకారం...  సోనూసూద్‌ లెక్కల్లో చూపించని ఆదాయాన్ని ఎన్నో బోగస్‌ సంస్థల నుంచి తనఖాలేని రుణాల రూపంలో తీసుకున్నారు. ఈ నిధులతో  పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి చేశారు. అంతేకాదు సోనూసూద్‌ ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సిఆర్‌ఏ) కింద నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ దాతల నుంచి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా 2.1 కోట్లు సేకరించారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఏర్పాటు చేసిన సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌కి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు రూ.18.94 కోట్ల విరాళాలు అందగా.. సోనూసూద్‌ వాటిలో 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వెచి్చంచారు.

మిగిలిన డబ్బంతా ఆ ఖాతాలోనే ఉంది. మరోవైపు సోనూసూద్‌కు చెందిన కంపెనీ ఇటీవల లక్నోకి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్తంగా ప్రాజెక్టులు మొదలు పెట్టింది. ఇప్పుడు ఐటీ శాఖ ఆ ఒప్పందాలు, ప్రాజెక్టులపై దృష్టి సారించింది. లక్నో సంస్థ బోగస్‌ బిల్లులు, సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్టుగా ఐటీ వర్గాలు ఆరోపించాయి. అలా 65 కోట్లకు పైగా నిధులు బోగస్‌ కంపెనీలకు దారి మళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక సోదాల సమయంలో సోనూసూద్‌ వద్ద నుంచి రూ.1.8 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టుగా ఆదాయపన్ను శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు