గంజాయి కట్టడికి టాస్క్‌ఫోర్స్‌!

20 Oct, 2021 01:38 IST|Sakshi

నేటి సీఎం సమీక్షలో ఏర్పాటు చేసే అవకాశం 

పోలీస్‌–ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ 

గంజాయి సరఫరాపై నిఘా మరింత పెట్టొచ్చని యోచన 

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ కేసులను సులువుగా ఛేదించొచ్చని అభిప్రాయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గంజాయి దందా ఆట కట్టించేందుకు పోలీస్‌–ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నేతృత్వంలో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు బుధవారం పోలీసు, ఎక్సైజ్‌ విభాగాలతో సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే జాయింట్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.

ఈ జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు వల్ల గంజాయి సరఫరా చైన్‌పై నిఘా పెరగడంతో పాటు అధికారులు, సిబ్బంది కూడా చొరవ చూపుతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రెండు విభాగాల నుంచి అధికారులు, సిబ్బందిని డెప్యూటేషన్‌పై తీసుకుంటారని తెలిసింది. పోలీసు నిఘా వ్యవస్థల ద్వారా అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ కేసులను కూడా సులభంగా ఛేదించొచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

‘పీడీ’పెట్టినా జోరుగా గంజాయి.. 
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పోలీసు, ఎక్సైజ్‌ విభాగాలు దాదాపు 1,200 కేసులు నమోదుచేసినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా 600కు పైగా కేసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోనే ఉన్నాయని, వీటి నియంత్రణకు పీడీ యాక్టులు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న డ్రగ్స్‌ కేసులు అధికారులను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 328 కేసులు నమోదు కాగా, 569 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఆ విభాగాల అధికారుల ద్వారా తెలిసింది. 1,500 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 58 డ్రగ్స్‌ కేసులు నమోదు చేయగా, 83 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 1,876 గ్రాముల కొకైన్, 312 గ్రాముల ఎండీఎంఏ, 151 ఎస్కటసీ పిల్స్‌ను సీజ్‌ చేశారు. పోలీస్‌ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 800కు పైగా కేసులతో పాటు, 1,200 మందిని కటకటాల్లోకి నెట్టినట్లు అధికారులు తెలిపారు. 4 క్వింటాళ్లకు పైగా గంజాయి సీజ్‌ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

విద్యార్థులే లక్ష్యంగా.. 
రాష్ట్రంలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలు దందా సాగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే 1,200లకు పైగా కేసులు నమోదయ్యాయంటే యువత ఏ స్థాయిలో గంజాయి మత్తులో తూగుతోందో అర్ధంచేసుకోవచ్చు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్‌ శాఖలు కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నా గంజాయి మాఫియా అంతకంతకూ వేళ్లూనుకుపోతూనే ఉంది. ఏకంగా ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు, టెలిగ్రాం మెసెంజర్ల ద్వారా కోడ్‌ భాషల్లో గంజాయి అమ్ముతున్నట్టు తేలింది.

విద్యార్థి దశలోనే మత్తుకు బానిసవుతున్న యువతను నియంత్రించాలంటే కఠినంగా వ్యవహారించాల్సిందేనని ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోనే కాకుండా జిల్లాల్లోని హెడ్‌క్వార్టర్లలో ఉన్న కాలేజీల్లో గంజాయి విపరీతంగా సరఫరా అవుతోందని, దీని కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవసరమని నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక అందించాయి. 

మరిన్ని వార్తలు