బయో డీజిల్‌ పేరుతో ఇంధన దందా 

6 Apr, 2022 04:06 IST|Sakshi
తెల్లని ద్రవపదార్థంలో పసుపు రంగు  కలిపే విధానాన్ని  చూపే వాహిక   

సాక్షి, యాదాద్రి: బయో డీజిల్‌ పేరుతో సాగుతున్న కృత్రిమ డీజిల్‌ దందాను సోమవారం స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు పారిశ్రామిక వాడ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు గుజరాత్‌లోని ప్రైవేట్‌ రీఫైనరీల నుంచి ద్రవపదార్థాలను తీసుకొచ్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ డీజిల్‌ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. పెట్రోల్‌ బంక్‌లలో లభించే డీజిల్‌ మాదిరిగానే ఈ కృత్రిమ డీజిల్‌తో వాహనాలు నడుస్తుండటంతో, వాహనాలకు మైలేజీ కూడా అధికంగా వస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

పెట్రోల్‌ బంకుల్లో లభించే డీజిల్‌ రేట్లు ఆకాశన్నంటుతుండటం, ఈ కృత్రిమ డీజిల్‌ లీటరు రూ.85 నుంచి రూ.90లకే లభిస్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్, భారీ వాహనాల వినియోగదారులు ఈ డీజిల్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాలకు ఈ కృత్రిమ డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆయిల్‌ ట్యాంకర్లలో డీజీల్‌ తీసుకువచ్చి బీబీనగర్‌ మండలం కొండమడుగు వద్ద గోదాంలో నిల్వ చేస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాహనదారులకు, కొన్ని పెట్రోల్‌ బంక్‌లకు తమ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొనుగోలు దారులను డీజిల్‌ అని నమ్మించేందుకు తెల్లని ద్రవ ప్రదార్థంలో పసుపు రంగు పౌడర్‌ను కలుపుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున రంగుప్యాకెట్లను సైతం నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు కొండమడుగు పారిశ్రామిక వాడలోని గోదాంపై సోమవారం దాడులు చేసి కృత్రిమ డీజిల్‌ ట్యాంకర్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేనేజర్‌ చిరాగ్‌పటేల్, ఈ డీజిల్‌ను కొనుగోలుచేస్తున్న సీఎంఆర్‌ ట్రావెల్స్‌ యజమాని, మరికొందరిపై కేసు నమోదు చేశారు.  

విచారణ జరుపుతున్నాం: ఎస్‌ఓటీ
కృత్రిమ డీజిల్‌ ఘటనపై విచారణ జరుపుతున్నామని భువనగిరి జోన్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ ఎ. రాములు తెలిపారు. డీజిల్‌ లాగానే ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు